Friday, November 30, 2007

Scientific Method 3


సాంస్కృతిక ప్రభావంలో సైన్స్ పాత్ర
విజ్ఞానాన్ని అన్వయించినందు వల్ల భౌతిక స్థితిగతులు మెరుగయ్యాయి. సాంస్కృతిక జీవనంపై కూడా బలమైన మార్పు కనబరచింది. బైబిల్, ఖురాన్, రామాయణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు వంటి ప్రమాణ గ్రంథాలు కోట్లాది ప్రజలకు, అందుబాటులో ఉండే ధరకు లభించడానికి ముద్రణాయంత్రం తోడ్పడింది. విద్యావ్యాప్తికి అవకాశం కలగడమేగాక ఎవరు కావాలన్నా విజ్ఞానం లభించే స్థితి వచ్చింది, ఈ విధంగా జ్ఞానాన్ని పవిత్రస్థానాల నుంచి మతరహిత రంగానికి తేవడంతో, ఇన్నాళ్ళు కొద్దిమంది అల్ప సంఖ్యాకులు స్వార్థంతో మానవజాతిని మూఢనమ్మకాలలో, మార్మిక స్థితిలో అట్టిపెట్టగా, అది నేడు తొలగే అవకాశం లభించింది. కులం హెచ్చుతగ్గులు పోగొట్టడానికి రైళ్ళు కొంత తోడ్పడ్డాయి. జ్ఞానం, పరస్పర సానుభూతితో మానవజాతి ఒకటిగా పెంపొందించడానికి అచ్చుయంత్రం ఉపకరించింది. లోగడ దేవుడి ఆజ్ఞానుసారం సమాజంలో హెచ్చుతగ్గులు ఉన్నాయనేవారు.
నేడు అందరికీ అందుబాటులో రేడియో, పుస్తకాలు, పత్రికలు, సినిమాలు ఉండడం వల్ల సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి దోహదం కలిగింది. దూరంగా ఉన్న ప్రదేశాలలో ఏమిజరుగుతున్నదో తేలుసుకోవడానికి నేడు ఎవరూ లక్షాధికారి కానక్కరలేదు. హ్యూయన్ సాంగ్ లాగ యాత్రికుడు కానక్కరలేదు. సముద్రంలోతులలో జీవితం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎవరూ గజయీత గాళ్ళుగా మారనక్కరలేదు. సమకాలీన, ప్రాచీన ప్రపంచ విషయాలు గ్రహించడానికి ఎవరూ ఐరోపా, అమెరికా వెళ్ళనక్కరలేదు. ఆరుభాషలు నేర్వనక్కరలేదు. ఇదంతా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజలు, సంపద, స్థితిగతులు, కులం, వృత్తితో కూడా నిమిత్తం లేకుండా, పుస్తకాలు ప్రచారసాధనాలతో ఇటువంటి కృషి జరుగుతున్నది. చావు అనేది అందరికీ సమానత్వం ఇచ్చింది. సైన్సు వల్ల సమానత్వం అనేది అందరికీ సాధ్యమని చెబుతున్నది.
జ్ఞానం, సమాచారంలాగే కళలు కూడా గ్రామాలలో గుడిసెలకు చేరాయి. అజంతా, ఎల్లోరాగుహల శిల్పాలు చూడవచ్చు. రవిశంకర్, గులాం అలీఖాన్ సంగీతం వినవచ్చు. షెక్స్ పియర్ నాటకాలు లండన్లో ప్రదర్శిస్తుంటే తిలకించవచ్చు. ఓవల్ రంగస్థలంలో క్రికెట్ ఆటను ఆనందించవచ్చు. చంఢీఘడ్ భవన సౌందర్యాన్ని, న్యూయార్క్ ఆకాశహర్మ్యాలను తిలకించవచ్చు. ఇంట్లో నుంచి కదలకుండా ప్రపంచంలోని కళలను, వినోదాలను అనుభవించవచ్చు. కళలు, ఆలోచనలను ఆధునిక సాంకేతిక శాస్త్రం మన ఇళ్ళకు తెచ్చి పెట్టింది. అర్థ శతాబ్దం కిందటి వరకూ సాధ్యం కానప్పటికీ, నేడు పౌరుడు ప్రపంచవ్యక్తిగా భావించుకునే స్థితిని కల్పించింది.

No comments: