విట్నే 1793
విజ్ఞానపు సాంకేతిక ప్రభావం
విజ్ఞానంతో సాధ్యపడిన నాగరికతాభివృద్ధి అంశాలను లెక్కించడం సాధ్యం కాదు, అవసరమూ లేదు. మనం గుర్తించడానికి వీల్లేనంతగా సాంకేతిక శాస్ర్తం చేసిన మార్పులను కొన్ని ప్రధాన రంగాలలో ప్రస్తావిద్ధాం.
1793లో విట్నె శాస్త్రజ్ఞుడు జిన్ యంత్రాన్ని కనుక్కోక పూర్వం, ప్రత్తిని చేతితో తీసేవారు. ఇది చాలా జాప్యంతో కూడినదని వేరే చెప్పనక్కరలేదు. కనక ఉత్పత్తి స్వల్పంగా ఉండేది. అందరికీ చాలినంత వస్త్రం నేయడం, పత్తి ఉన్నా సరే సాధ్యమయ్యేది కాదు. విట్నె కనిపెట్టిన జిన్ యంత్రం వల్ల రోజుకు ఒక్కొక్క కార్మికుడు లోగడకంటే 50 రెట్లు ఆదనంగా పత్తిని బాగుచేయగలిగాడు. ఈ నాటికీ అందరికీ తగినంత వస్త్రం లభించక పోవడానికి కారణం ఆర్థికపరమైన వెనుకబడిన తనమే గాని, సాంకేతికం మాత్రం కాదు.
పత్తి విషయంలో లాగే ఇంచుమించు వినిమ వస్తువులన్నిటిలో ఇదే వాస్తవం. వస్త్రంలాగే, ఆహారాన్ని కూడా సమృద్ధిగా అందించవచ్చు. జనాభాను అదుపులో పెట్టి, వ్యవసాయంలో వైజ్ఞానిక పద్ధతులు అవలంబిస్తే సరిపోతుంది. ఉదాహరణకు, ఇప్పటి జనాభా ఇక పెరగకుండా కుటుంబ నియంత్రణ అవలంబించవచ్చు. పంటలు మార్చుతూ తగిన ఎరువులు వాడవచ్చు. నీటివనరులు, కట్టలు పోయడం, చీడ నివారణతో పంటతెగుళ్ళు అరికట్టడం, లోతుగా భూమిని దున్నడం, అందుకు మేలైన నాగళ్ళు వాడడం, ఇలా వెయ్యి పద్ధతులు అనుకరించవచ్చు. అప్పుడు ప్రతి భారతీయుడు ఆరోగ్యంగా, శక్తిమతంగా ఉండవచ్చు. నేటివలె కళ్ళు పీక్కుపోయి దిగాలుపడి ఉండనక్కర లేదు. మనకు నేడు ఆహారవస్తువుల కొరత ఉందంటే, సాంకేతికశాస్త్ర లోపం కాదు. సాంకేతిక శాస్త్రాన్ని అధికోత్పత్తి కోసం, ఆహారాన్ని సరిగా పంపిణీ చేయడం కోసం వినియోగించక అడ్డుపడే సామాజిక, సాంస్కృతిక లక్షణాలలో కారణాలను చూడవలసి ఉంది.
మనకు లోగడ తెలిసిన వస్తువులలో ఉత్పత్తి అధికం కావడానికి సాంకేతిక శాస్త్రం తోడ్పడటమే గాదు. మనం కలలోనైనా ఊహించని కొత్త వస్తువులను సృష్టించింది కూడా. ఉదాహరణకు, అక్బర్, శివాజీల కాలంలో కృత్రిమ నీలిమందు గాని, ఎరువుల నిమిత్తం నత్రజనిని తయారు చేయడం గాని ఎవరూ ఆలోచించి ఉండరు. అలాగే గనుల నుంచి బంగారాన్ని తీయడానికి సైనైడ్ పద్ధతిని, పెట్రోలియం వస్తువుల తయారీ, విద్యుత్-రసాయనిక పరిశ్రమ, స్టెయిన్ లెస్ స్టీల్, కృత్రిమ రసాయనిక వస్త్రాలు-నైలాన్, రేయాన్ వంటివి ఎవరూ కలగనలేదు.
రవాణా, వార్తా ప్రసారాల రంగంలో విప్లవం వచ్చింది. ఆవిరి యంత్రం కనుక్కోకముందు, అతి వేగంగా వెళ్ళే సాధనం గుర్రం మాత్రమే. గుర్రానికి హద్దులున్నాయి. బతికేది. కొద్ది కాలం, పోషణకు ఖర్చు ఎక్కువ. కనకనే దేశంలో ఎడ్లబండ్లు సర్వసాధారణంగా ఉండేవి. వేడికీ యంత్రశక్తికీ సంబంధం తెలుసుకునే అవకాశాన్నిచ్చింది. సముద్రాలను దాటడానికి, లోగడ తెలియని ఖండాలను కనుక్కోవడానికి దోహదం చేసింది. ఆవిరి యంత్రం ప్రపంచాన్ని ఐక్యపరచడం ప్రారంభిస్తే, జెట్ విమానాలు ఈ కృషిని పూర్తి చేశాయి. కొత్త శక్తి, వనరులు, పెట్రోలు, అణుశక్తి వల్ల మానవ చరిత్రలో మొదటిసారిగా, ‘ప్రపంచమే నా గృహం’ అనే భావాన్ని సాధారణ వ్యక్తిలో కూడా వచ్చేటట్లు చేశాయి. అభివృద్ధి చెందని మనదేశం వంటిచోట, లండన్లో, న్యూయార్క్ లో జరిగే వార్తలను పొరుగూరు వార్తలకంటే త్వరగా తెలుసుకోవచ్చు. విమానం, టేలిగ్రాఫ్, వైర్ లెస్, టేలివిజన్ వంటివి దూరాన్ని ఆటంకంగాకూండా చేసి, ప్రపంచ ప్రభుత్వం ఆవిర్భవించడానికి, సామాన్య మానవ సంస్కృతి రావడానికి ఉపకరించాయి. ఆధునిక ప్రసార సాధనాలు మానవ కుటుంబాన్ని సన్నిహితం చేసి, మానవుడు వినడాన్నీ చూడడాన్నీ వెయ్యి రెట్లు పెంపొందించాయి. కొత్త నక్షత్రాలు, పాలపుంతలు, సూక్ష్మజీవులు, ఎలక్ర్టాన్లు, శబ్దానికి రంగుకు చెందినవెన్నో మానవుడికి తెలిశాయి. ఇటువంటి ఆధునాతన నాగరికతా సౌకర్యాలు భారత గ్రామాలలోని మారుమూలలకు చేరలేదంటే సాంకేతిక అజ్ఞానం కారణం కాదు. దీనికి సాంకేతికేతర కారణాలు ఉన్నాయి.
ఇంజనీరింగ్ భవన నిర్మాణరంగంలో ఇటువంటి విప్లవమే వచ్చింది. పర్వతాలలో సొరంగాలు తవ్వడం, పెద్ద నదులపై వంతేనలు నిర్మించడం, ఆకాశ భవనాలు కట్టడం అందులో వందలాది కుటుంబాలు హాయిగా నివసించగలగడం, పేదలకు గుడిసెలస్థానే శాశ్వత గృహాలను నిర్మించడం, గాలి, వెలుతురు వచ్చే పాఠశాల భవనాలు, ఇవన్నీ లోగడ మహాశక్తి మంతమైన సామ్రాజ్యాలకు కూడా అనూహ్యమే. గతంలో పెద్ద సామ్రాజ్యాల రాజధానులకంటే నేడు పురపాలకవాడలలో సామాన్యుడు బాగా ఉంటున్నాడు. 300 సంవత్సరాలకు పూర్వం ఐరోపావారు వచ్చి స్థిరపడినప్పటి కంటే నేడు ముంబాయిలో జీవితం గుణాత్మకంగా పెంపొందింది.
ఆధునిక వైద్యం మానవజాతికి ఎలా వర ప్రసాదంగా మారిందీ చెప్పనక్కరలేదు. ఒకప్పుడు ఉన్నట్లు నేడు మలేరియా, కలరా, ఆటలమ్మ, ప్లేగు శాపాలుగా లేవు. సన్నిపాతజ్వరం, క్షయ అదుపులోకి వచ్చాయి. ఇప్పుడు భయానకంగా ఉన్న కేన్సర్ కూడా త్వరలో అలా కాకుండా పోతుందని ఆశించవచ్చు.
శస్త్ర చికిత్సను కూడా వైద్యాభివృద్ధితో పోల్చవచ్చు. కృత్రిమ శరీరభాగాలను అమర్చడం, కొత్త కంటిపాపలను పెట్టడం, గుండె, మెదడు శస్త్ర చికిత్స చేయగలగడం, కొన్ని సందర్భాలలో లింగమార్పుకూడా సాధ్యపడుతున్నది. ఆరోగ్య శాస్త్ర అభివృద్ధి ఫలితంగా చావులు తగ్గాయి. ముఖ్యంగా బాల్య మరణాలు తగ్గిపోయాయి. మంచి ఆరోగ్యంతో జీవన ప్రమాణం కొనసాగించే వీలు చిక్కింది. రెండు వందల ఏళ్ళ కితం పుట్టిన పిల్లలు యుక్తవయస్సు రాకముందే చనిపోతుండేవారు. సగటు జీవితం 30 ఏళ్ళు మాత్రమే ఉండేది. నేడు ఇండియా వంటి పేద దేశంలో సైతం బాల్య మరణాలు చెప్పుకోదగినంతగా తగ్గిపోయాయి. గత మూడు దశాబ్దాలలోనే జీవిత వయస్సు సగటున 36 నుంచి 42 ఏళ్ళకు పెరిగింది. పుట్టిన వారిలో ఎక్కువమంది బతుకుతున్నారు. ఎక్కువకాలం జీవిస్తున్నారు. ఆరోగ్య ప్రమాణాలు మెరుగుగావడం వల్ల సామాన్యుడికి భద్రత, సంక్షేమ దృష్టి వచ్చింది. జాతీయస్థాయిలో కుటుంబనియంత్రణ పథకం లేనందున జనాభా పెరుగుదల అనేది అభివృద్ధి చెందని దేశాలలో పెద్ద సమస్యగా మారింది.
No comments:
Post a Comment