Monday, November 12, 2007

Sanyasi Satyam(Ochre Robe) 12

బళ్ళారిలో చాతుర్మాస్య దీక్ష
నేను బళ్ళారిలో చాతుర్మాస్య దీక్ష ప్రారంభించాను. ఒక స్మార్త బ్రాహ్మణుడు నాకు ఆతిథ్యం ఇచ్చాడు. ప్రతిరోజూ సాయంత్రం సమావేశాలు జరిగేవి. పొద్దుబోయే వరకూ సాగేవి. మధ్య తరగతి వారితో నాకు సన్నిహిత పరిచయం కలిగింది. కాలేజి విద్యార్థులు సంస్కృతీ పరులైన స్త్రీలు ఆ సమావేశంలో పాల్గొని చర్చను ఆసక్తికరం చేసేవారు. మూడు మాసాలు లోపే వర్షాలు తగ్గినందున చాతుర్మాస్యం అన్ని ముగించుకుని, మైసూరులోని శృంగేరి పీఠానికి వెళ్ళాను. దేవాలయం వద్ద కొలనులో స్నానం చేసి శారద పూజ చేసి, జగద్గురువు శంకరాచార్య చంద్రశేఖర భారతి దర్శనార్ధం వెళ్ళాను. అక్కడ ఒక స్వామి నన్ను సాదరంగా అతిథి గృహంలో ఉంచారు. మరునాడు స్వామీజీ వద్దకు రమ్మన్నారు. అలాగే వెళ్ళాను. కాని శంకరాచార్యుల వారు నన్ను చూడరని చెప్పారు. నేను కారణం అడగలేదు. ఆయన తపోదీక్షలో ఉన్నందున తరచు ఎవరినీ కలవడం లేదని చెప్పారు. ఆరోగ్య దృష్ట్యా ఆయన ఏదో ఉన్మాద స్థితిలో ఉన్నట్లు కొందరు చెప్పారు. తరువాత కొద్ది సంవత్సరాలకే తుంగభద్రలో స్నానం చేసిన అనంతరం ఆయన చనిపోయారు. కాని నన్ను చూడడానికి నిరాకరించడంలో విశ్వానంద ఊహించిన కారణమే కావచ్చు. నా గురించి ఆయనకు ముందే తెలియజేశాను. నేను సన్యాసిని అని ఆయన గుర్తించలేదు. ఒక సాధారణ వ్యక్తిగానూ చూడలేరు.
విచారంగా శృంగేరీ వదిలి తొమ్మిది మాసాల పాదయాత్ర అనంతరం మొదటిసారిగా బస్సెక్కాను. షిమోగా, హసన్ల మీదుగా బేలూరు, హళబీల్లో, హోయనల శిల్పాలను చూడడానికి వెళ్ళాను. అక్కడ కామశిల్పాలు విరివిగా, అందంగా ఉన్నవి. వీటిని హిందూ పునర్వికాసకారులు అసహ్యించుకుంటారు. హిందూ సంప్రదాయంలో అంతర్భాగంగా వీటిని నేను అభినందించాను. ఇవి అనేక సాంస్కృతిక సమస్యలకు పరిష్కారాలిస్తాయి.
బెంగుళూరులో రైల్వే స్టేషను నుండి పోతుండగా ఒక తమిళుడు వచ్చి నన్ను అతిథిగా ఉండి, తన గృహాన్ని పావనం చేయమన్నాడు. ఆహారం కేవలం శాకపాకాలతో ఉన్నప్పటికి చాలా రుచిగా ఉన్నాయి. వియన్నా కాఫీ నాకు గుర్తుకు వచ్చింది. దక్షిణాదిలో కాఫీ చాలా బాగుంటుంది. హాలు మధ్యలో సోఫా మీద నేను ఆసీనుడిని కాగా ఇంటి యజమాని, స్నేహితులు, వారి భార్యలు వచ్చి నాకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఇంగ్లీషులో ఒక అర్థగంట మాట్లాడిన తరువాత చర్చ హుందాగా, హాస్యపూరితంగా హైందవ సంస్కృతీ విలువలతో సాగింది. ఇది నాకు చాలా ఇష్టమైన కార్యక్రమం. పాదయాత్రలో ఇలాంటివి తక్కువ నా రాకను ముందుగానే ప్రకటిస్తారు. గనుక కొన్ని ప్రశ్నలతో వచ్చేవారు. తరువాత ఎక్కడికి వెళతారని నన్ను అడిగారు. చెప్పాను. ఎలా వెళతారని అడిగాడు. ఏమో తెలియదన్నాను. టికెట్ కొనే అవకాశాన్ని తనకు కల్పించమని అడిగాడు. మొదటి తరగతి టికెట్ కొని ఇచ్చారు. అది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. మద్రాసు మీదుగా ఇటార్పి., కాశీ చేరుకున్నాను. చూడడానికి కావలసినన్ని దృశ్యాలు, సావకాశంగా ఆలోచించడానికి కావలసినంత కాలం లభించింది. ప్రపంచం దుఖఃమయం కనుక నేను సన్యాసిని కాలేను. ఆనందమయం కనుకనే సన్యాసినయ్యాను.

సన్యాసి దినచర్య
సన్యాసి దేవాలయంలో, ధర్మశాలలో, బ్రాహ్మణ గృహంలో, చెట్టుకింద రాత్రిళ్ళు విశ్రాంతి తీసుకోవాలి. సూర్యాస్తమయం కాకముందే నిద్రలేవాలి. నదిలోనో, చెరువులోనో లేక సమీపాన ఉన్న జలాశయంలో స్నానం చేయాలి. తరువాత వాటి తీరాన లేదా దేవాలయంలో కూర్చుని ధ్యానం చేయాలి. గ్రామస్తులు లేచి దినకృత్యాలు ప్రారంభించకముందే సాధువు తన మూట ముల్లె సర్దుకుని బయలుదేరాలి. నా అనుభవం రోజుకు పది మైళ్ళకు మించి సాధువు ప్రయాణం చేయడు. ఉదయాన వాతావరణం చల్లగా హాయిగా వుంటుంది. యేకాంతంగా ప్రకృతి సౌందర్యం అనుభవిస్తూ నడవడానికి బాగుంటుంది. గ్రామాలలో ఉదయం 8 గంటల ప్రాంతంలో వంట పూర్తవుతుంది. అప్పటికి సాధువు బయలుదేరిన ప్రాంతం నుండి కొత్త గ్రామానికి చేరుకోవాలి. వండిన పదార్ధాలు సాధువు స్వీకరించకూడదు. భిక్ష స్వీకరించటంలో యేదైనా ఒక ఇంటిని నిర్ణయించుకోవచ్చు లేదా ఇచ్చేవారి నుండి ఒక్కొక్క రొట్టెను, ఒక ముద్ద అన్నం మాత్రమే స్వీకరించాలి. సన్యాసి గ్రామ శివార్లలోకి రాగానే బిగ్గరగా ఓం నమో నారాయణ అని ఉచ్ఛరించాలి. ఆ పిలుపు వింటారు. సర్వ సాధారణంగా స్త్రీలు లేదా పురుషులు తొంగి చూచి ఆహారం స్వీకరిస్తారా అని అడుగుతారు.
కాషాయవస్త్రం ధరించేవారి ప్రవృత్తి ఎలాంటిదో తెలుసుకోకుండానే భక్తి వల్లనో, భయం వల్లనో ఆహారం ఇస్తారని ఒక విమర్శ ఉంది. సాధువులు తినడానికే వస్తారని భావిస్తారు. సన్యాసికి భిక్ష యివ్వకపోతే శపిస్తాడని గ్రామస్తులు భయపడతారు. కాని అది నిజం కాదు. భయం కంటే భక్తితోనే భిక్ష ఇస్తారు. పేదవారు సైతం తమ కుటుంబ సభ్యులకు తినడానికి ఉందోలేదో గమనించకుండానే సాధువుకు పెడతారు. సాధువు మాత్రమే భారతదేశ గ్రామాలలో మానవత గల వ్యక్తి విలువలను చాటి చెప్పగలడు.
గ్రామస్తులు ఏది వండుకుంటే అదే సాధువుకు పెడతారు. కాలాన్ని బట్టి రుతువులను బట్టి ఇది మారుతుంటుంది. ఉత్తరప్రదేశ్ నుండి మైసూర్ వరకు విభిన్న వంటకాలను తిని ఆరగించుకోవాలంటే సాధువులకు చాలా శక్తి కావాలి. ఉత్తరాదిలో సాధారణంగా సాధువుకు రొట్ట, పప్పు ఇస్తారు. దక్షిణాదిలో అన్నం, పప్పు పెడతారు. మాంసాహారాన్ని సాధువుకు పెట్టరు. దక్షిణాదిలో ఉల్లిపాయలను కూడా మసాల దినుసుగా భావిస్తారు. ఉల్లిపాయలకు బదులు సనాతనులు కొందరు ఇంగువ వాడతారు. దీని వాసన దుర్భరం. సాధువు తనతో పాటు ఒక పళ్ళాన్నీ, నీటి పాత్రను తీసుకు వెళ్ళాలి. ఇత్తడితో గాని, కొబ్బరి చిప్పలతో గాని ఈ పాత్రలు తయారు చేస్తారు. రొట్టెలను ఆహారాన్ని బట్టలో భుజించే వరకు వేడిగా ఉండేటట్లు చూచుకుంటారు. సన్యాసి ఆహారం స్వీకరించి కృతజ్ఞతలు చెప్పడు. తమకు ఆహారం పెట్టే అవకాశాన్ని కల్పించినందుకు సన్యాసికే కృతజ్ఞతలు చెప్పడు. తమకు ఆహారం పెట్టే అవకాశాన్ని కల్పించినందుకు సన్యాసికే కృతజ్ఞతలు తెలుపుతారు ప్రజలు. ఒక రోజు ఆ గ్రామంలో వుండి వేదాంత బోధ చేస్తానని సన్యాసి సూచిస్తాడు. సన్యాసి గ్రామం వచ్చినట్లు అరగంటలో గ్రామమంతా ప్రాకిపోతుంది.
సన్యాసి ఏకాంతంగా ఉండాలి. ఏకాంతంగానే భుజించాలి. తరువాత ఒక గంట సేపు పవిత్ర గ్రంథ పఠనం చేయాలి. అప్పటికి గ్రామస్తులు చేరి ప్రణామం చేసి వింటూ కూర్చుంటారు. ఆ తరువాత సన్యాసి సంభాషణ ప్రారంభించి సందేహాలు అడగమంటాడు. మధ్యలో ఒక గంట విశ్రమించి తరువాత ప్రశ్నల సమావేశం కొనసాగిస్తాడు. సాధువు విశ్రమించడానికి రహస్య ప్రదేశం ఉండదు.
కేరళ, ఆంధ్ర, పంజాబు రాష్ర్టాలలో సన్యాసులకు ఆదరణ తక్కువ. బీహార్, రాజస్తాన్, అంత వ్యతిరేకత లేదు. కేరళలో ఆంధ్రలో సెక్యులర్ విద్య ఎక్కువగా ఉండటం వలన ఈ వ్యతిరేక ధోరణి ప్రబలింది. గ్రామాలలో మధ్యాహ్నం రెండు నుండి నాలుగు వరకూ పొలాల నుండి పురుషులు తిరిగి వస్తుంటారు. వారికంటే ముందుగానే స్త్రీలు, సాధువు దగ్గరికి చేరుకుంటారు. ఒకవైపు పురుషులు, మరొకవైపు స్త్రీలు కూర్చుని వింటారు. పిల్లలు మాత్రం ఇష్టంవచ్చినట్లు తిరుగుతుంటారు.
సర్వ సాధారణంగా గ్రామ పెద్ద లేదా బ్రాహ్మణుడు ఏదో ఒక ప్రశ్న వేస్తాడు. ఈ ప్రపంచంలో బ్రతుకుతూ మతవిధులను నిర్వర్తించడం ఎట్లా? గృహస్తు భగవంతుడిని పూజించడంలో ఏ మార్గాన్ని అనుసరించాలి? పుట్టుక పునర్జన్మ బాధలు అనే బంధాల నుండి తప్పించుకొనే మార్గం యేమిటి? ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. సమాధానాలు కూడా ఇంచుమించు ఒకే రీతిగ ఉంటాయి. దైవం మీద మనస్సును లగ్నం చేసి, ధ్యానం చేయండి. ఎవరికి తగినట్లుగా వారు చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థించుకోవచ్చు. ఎవరి విధులు వారు చేస్తూనే సమయం ఆసన్నమయ్యే వరకు యోగాభ్యాసాన్ని చేస్తూ, ఆథ్యాత్మిక జీవితానికి దారి తీయవచ్చు. ఇలాంటి సమాధానాలు చెప్పడంలో సాధువులు తమ ప్రతిభను, చమత్కారాన్ని ఉపయోగించి కథలుగా చెపుతుంటారు. అంతవరకు ఫరవాలేదు కాని, కొందరు వ్యక్తిగతమైన ప్రశ్నలు వేస్తారు. అప్పుడే చిక్కు యేర్పడుతుంది. గ్రామస్థులు సమస్యలను సాధువు ముందు పెట్టి పరిష్కరించమంటారు. తరువాత ప్రపంచ సమస్యలు కూడా అడుగుతారు. జర్మనులు వేదాలను తస్కరించి, అందులో పేర్కొన్న ఆయుధాలు తయారు చేసిన మాట నిజమేనా? లంక నుండి సీతను తీసుకు రావడానికి రాముడు ఉపయోగించిన పుష్పక విమానం రష్యాలో ఉన్నదా?.
తమ పిల్లలు మాట వినడం లేదని, లేదా పిల్లలు పుట్టడం లేదని ఇలాంటి సమస్యలెన్నో పెడతారు. సాధువు దైవజ్ఞుడు కనుక, భూమి తగాదాలతో సహా దేనినైనా పరిష్కరించగలడని అనుకుంటారు. కొందరు సాధువులు ఇలాంటి వాటిని పెడచెవిని పెడతారు.
సాధువుకు కొద్దో, గొప్పో వైద్యం వచ్చి ఉండాలి. కొందరు సాధువులు ఆయుర్వేధంలో సిద్ధహస్తులు, అనుభవరీత్యా ఈ సాధువులు చిన్న చిన్న రోగాలను నయం చేస్తుంటారు.

ఢిల్లీలో ప్రపంచ సాధు సమావేశంకాశీ నుండి ఢిల్లీ వెళ్ళాను. బిర్లా దేవాలయం ప్రాంగణంలో అందమైన అతిథి గృహం ఉన్నది. అందులో పక్షం రోజులకు మించి ఉండనివ్వరు. నేను ఒక నెల రోజుల పాటు ఉన్నాను. నీవు ఆధ్యాపకుడిగా యెందుకు పనిచేయవని కొందరు అడిగారు. ఒకరోజు బస్సెక్కి న్యూఢిల్లీ విశ్వ విద్యాలయానికి వెళ్ళాను.

No comments: