ఢిల్లీలో ప్రపంచ సాధు సమావేశం
కాశీ నుండి ఢిల్లీ వెళ్ళాను. బిర్లా దేవాలయం ప్రాంగణంలో అందమైన అతిథి గృహం ఉన్నది. అందులో పక్షం రోజులకు మించి ఉండనివ్వరు. నేను ఒక నెల రోజుల పాటు ఉన్నాను. నీవు ఆధ్యాపకుడిగా యెందుకు పనిచేయవని కొందరు అడిగారు. ఒకరోజు బస్సెక్కి న్యూఢిల్లీ విశ్వ విద్యాలయానికి వెళ్ళాను. డీన్ డాక్టర్ రామ్ బిహారి దగ్గరకు వెళ్ళాను. పది నిమిషాలు మాట్లాడిన తరువాత విషయాలన్నీ తేల్చాను. నా ఇష్టం వచ్చిన విషయాన్ని బోధించమన్నారు. సన్యాసిగా నాకు జీతం ఉండదు కాని, భోజనం వసతులు ఉచితం.
1951 ఏప్రిల్లో ఢిల్లీలో ప్రపంచ సాధు సమావేశం జరిగింది. సాధువులను దర్శించి, పూజించడానికి, వారి పాదాలు స్పృశించడానికి తండోపతండాలుగా భక్తులు వచ్చారు. ఢిల్లీ ఇసుకవేస్తే రాలనట్లు జనంతో నిండిపోయింది.
నర్సింగ బాబా అనే నాగా నాయకుడు దిగంబరంగా వచ్చాడు. సన్యాసులలో నాగాలు వీరత్వం కలవారు. సాధువులను రక్షించడం వీరి ధర్మం. ఈ నాగా సాధువులు అద్వైతులు. వీరు తమ మఠాలలో నగ్నంగా వుంటారు. బయట తిరిగేటప్పుడు కౌపీనం ఒక్కటే ధరిస్తారు. దేహమంతా బూడిద పూసుకుంటారు. త్రిశూలం ధరిస్తారు. నేను ప్రప్రథమంగా నాగాను కలుసుకున్నాను. నాగా సాధువులు హిమాలయ మంచులోనూ, ఎడారుల్లోనూ ఒకే రకంగా ఉండగలరు.
నర్సింగబాబా కొందరు నగ్న సాధువులతో సమావేశానికి వచ్చారు.
ఆయనకు నన్ను పరిచయం చేసినప్పుడు నమఃశివాయ అని ప్రణామం చేశాను.
సాధువులు కలిసినప్పుడు ఎలా ప్రణామం చేసుకుంటారో తెలియదా? అన్నారు.
ఓం నమో నారాయణ అంటారు. కాని నారాయణ పదం ఒక శాఖకు చెందినదిగా మీకభ్యంతరం కాదా అన్నారు.
నర్సింగ బాబా సమాధానం ఇస్తూ, సాధువుల ప్రయోగంలో నారాయణ వైష్ణవులకు చెందినది కాదని, కాబట్టి నారాయణ పదప్రయోగంలో తప్పులేదని అన్నారు. నేను ఆశ్చర్యపోయాను.
నర్సింగ బాబా యూనివర్సిటి లో సైకాలజీ చదివారు.
సాధువుల సమావేశం చివరి రోజున గాంధీ మైదానం నుండి చాందినీ చౌక్, ఎర్రకోట, కాశ్మీర్ గేటు మీదుగా సాధువులంతా ఊరేగింపుగా నడిచారు. మధ్యాహ్నం 2 గంటలకు నేను ముందు నడుస్తుండగా 20,000 మంది సాధువుల ఊరేగింపు ప్రారంభమైంది. రెండు లక్షల ప్రజలు వచ్చి చేరారు. ఇళ్ళకప్పు లెక్కి చెట్ల మీద నుండి మమ్మల్ని చూశారు. నాలుగు గంటల సేపు రెండు మైళ్ళ ఊరేగింపు సాగడానికి పట్టింది. త్రోవలో చాలా చోట్ల సాధువుల పాదాలను ప్రజలు స్పృశించారు. ఊరేగింపు పూర్తయ్యే సరికి చీకటి పడింది. వేద మంత్రాలు పఠిస్తుండగా ప్రసాదాలు పంచిపెట్టారు. లక్ష్యమంది ప్రజలకు ప్రసాదాల పంపిణి జరిగింది.
హరిద్వార్ లో
విద్యా సంవత్సరం ముగిసింది. ఢిల్లీలో ఎండలు దుర్భరంగా ఉన్నాయి. రైలులో హరిద్వార్ కు బయలుదేరాం. అది కూడా చాలా వేడి ప్రదేశం. హిందువులకు కాశీ ఎలాగో పంజాబ్ వారికి హరిద్వార్ అలాగ. ఇక్కడ గంగలో బ్రహ్మకుండం ఉన్నది. నిత్యం అనేక మంది యాత్రికులు స్నానాలు చేస్తుంటారు. వెయ్యికి పైగా ఆశ్రమాలున్న హరిద్వార్ అంతా సన్యాసుల ప్రభావంతో ఉంటుంది. హరిద్వార్ వాసులు సన్యాసులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. నేను రైలుదిగి గీతాభవనంలో నా సామాను పెట్టాను. ఒక ఫర్లాంగు దూరంలో భోలగిరి మఠం ఉన్నది. భోలగిరి మఠంలోని సన్యాసులు ఒక్కొక్క శాఖలో నైపుణ్యం సంపాదిస్తారు. భిన్న విషయాలను అధ్యయనం చేస్తారు. పాశ్చాత్య సమకాలీన తర్కంతో సరితూగగల నవ్య న్యాయ సిద్ధాంతాలపై భాష్యం రాసిన ఒక పండితుని ఇక్కడ కలిశాను. భాస్కరుడి లీలావతిపై విస్తృత భాష్యాన్ని రాసిన మరొక పండితుని కలిశాను. మరో పండితులిద్దరు భారతీయ సంగీతంపై 20 సంవత్సరాలుగా అధ్యనం చేస్తున్నారు. నేను భోలగిరి మఠానికి వెళ్ళినప్పుడు శంకరాచార్యుడికి హారతిగీతం పాడుతున్నారు. నేను వారితో కలిశాను. సంస్కృత చందస్సు గురించి కొందరు నాతో చర్చకు దిగారు. అంతేగాని నా పేరు, ఎక్కడ నుంచి వచ్చానని అడగలేదు. ఇదీ ఆశ్రమాలలో మర్యాద. హరిద్వారాలో అన్ని వర్ణాల సాధువులున్నారు.
హార్కి పహాడి దగ్గర ఒక బోర్డు మీద ఇంగ్లీషులో-హిందువులు కాని వారు ప్రవేశించరాదని ఉన్నది. ఇండియాలో బహిరంగ ప్రదేశాలలో ఇలా ఉండటం నేనెక్కడా చూడలేదు. నేనొక అమెరికా మిత్రుడిని వెంటబెట్టుకెళ్ళినప్పుడు కొందరు ఆశ్చర్యంగా చూసినా ఎవరు అభ్యంతరం పెట్టలేదు. కాశీవిశ్వనాథ ఆలయంలోనూ దక్షిణ భారతదేశంలోనూ అపవిత్రం చేస్తారనే దృష్ట్యా ఇలాంటి నిబంధనలు విధించారు. హార్ కిపహాడి దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి బ్రహ్మకుండిలో మునిగి చుట్టూ వినిపించే శ్లోకాలను విని ఆనందిస్తూ ప్రతిరోజూ సాయంత్రం గడిపేవాడిని. అనేక మఠాలను, సంస్థలను సందర్శించాను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment