Monday, November 26, 2007

Agehananda enters new world 19


కొత్త ప్రపంచంలోకి
వివేకానందుడు గత శతాబ్దాంతంలో అమెరికా, యూరప్ లలో పర్యటించారు. ఆయన వలన భారతదేశం పట్ల అక్కడివారికి అసక్తి పెరిగింది. మేధావులు ఉద్వేగం పొందారు. దురదృష్టవశాత్తు కుహనా స్వాములు కొందరు వివేకానందుకు తోడయ్యారు. ఈ విషయాన్ని ఆయన గ్రహించలేక పోలేదు. కాని అలాంటి వారిని వివేకానంద నిరుత్సాహ పరచలేదు. అందు వలన ఈ స్వాములచుట్టూ మరికొందరు స్వాములు పోగయ్యారు. అందులో కొందరు పూర్వ జన్మలో భారతీయులమన్నారు. అలాంటి వారంతా వివేకానందుడు నాటిన విత్తనాలు బాగా పెంచి, పోషించి రెండు ఖండాలలో పర్యటించి అనుచరులను పోగుచేసి బాగా డబ్బు వసూలు చేశారు. అయితే రామకృష్ణ, వివేకానంద వేదాంత కేంద్రాలు ఆ మిషన్ వారు నడిపినంత కాలం బాగానే సాగాయి. హాలివుడ్ లోని దక్షిణ కాలిఫోర్నియా కేంద్రం స్వామి ప్రభవానంద ఆధ్వర్యాన నడిచింది. ఆయన గీతానువాదం 10 లక్షల ప్రతులు అమ్ముడుపోయింది. అల్డస్ హక్సలి, క్రిస్టఫర్ ఈషర్ వుడ్, గెరాల్డ్ హెర్డ్, గ్రేటా గార్బో మొదలైనవారు ఈ కేంద్రాన్ని సందర్శించారు. దీక్షపొందిన ముగ్గురు అమెరికా యువతులు కుంభమేళాలో వేలాది ప్రజలతో పాటు నదిలో స్నానం చేశారు. స్వామి అశోకానంద శాన్ ప్రాన్సిస్ కోలో ఆశ్రమాలను కఠిన నియమాలతో నిర్వహించారు. రామకృష్ణ సూక్తులు, వేదాంత సాహిత్యం పైన వ్యాఖ్యానం వలన ఆయనకు పేరు వచ్చింది. ఒకవైపున ఇలాంటి ఉత్తమ కేంద్రాలు నడుస్తుండగా మరో వైపు ఇంచుమించు పిచ్చి వారనదగిన సాధువులు సైతం ఈ ఆశ్రమాల పేరుతోనే చలామణి అయినారు.
నేను వాషింగ్ టన్ యూనివర్శిటీలో ఇన్నర్ ఏషియా ప్రాజెక్టులో చేరాను. ఇందులో ఫీడర్ సర్వీసని ఒకటి పెట్టాము. ఇక్కడ పరిశోధనా సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. నేను భారతీయ అధ్యయన్నాన్ని ప్రవేశ పెట్టగలిగాను. భఆరతీయ తాంత్రిక విద్య, టిబెట్ బుద్ధిజంతో సంబంధం అనే పుస్తకం రాయటానికి ఈ సంస్థవారు ఎలాంటి షరతులు లేకుండా ఖర్చు పెట్టారు. అమెరికాలోనే ఈ పద్ధతి సాధ్యం. చాలా సంస్కృత, హిందీ గ్రంథాలను నేను తెచ్చాను. కోర్స్ ప్రారంభించినపుడు హిందీకి 98 మంది ఉండగా, సంస్కృతం చదవటానికి 28 మంది వచ్చారు. క్రమంగా వీరి శాతం తగ్గి పోయింది. ఇలాంటి కోర్చులు తక్షణమే పనికిరావని అమెరికాలో అభిప్రాయం ఉన్నది. నా పరిశోధనకు తగినంత సాధన సంపత్తి అత్యంత అధునాతన పరికరాలు ఉండేవి. ఇతర గ్రంథాలయాల నుండి కావలసిన పుస్తకాలను తెప్పించుకోవచ్చు. అనుకూల వాతావరణం, మైక్రోఫిల్మ్ లాంటివి పుష్కలంగా ఉన్నాయి. అమెరికాలో సమాకాలీన దృష్టి ఎక్కువ, స్వామి అంటే ఆకర్ముడిని వారి దృష్టి అందువలన నా వంటి వారు ఆమెరికా ఆధునిక రీతుల్లో ముఖ్యంగా క్రైస్తవ విలువలు పాటించే చోట ఒక పట్టాన ఇమడరు. ఇదిగాక ప్రాచీన భారతదేశాన్ని గురించి విదేశీయులు చూపించే ఆసక్తి పట్ల ఇండియాలో చాలా అనుమానాలున్నాయి. ప్రాచీన భారతదేశంలోని మార్మిక అలవాట్లు కృతువులు, అస్సాం, బెంగాల్ లోని అవినీతికర మతాచారాలు, తర్కంలోని లోపాలు, వాటి వలన ఇండియాపట్ల విదేశాలలో అపఖ్యాతి వచ్చిందని, కనుక ఆ విషయాల జోలికి పోకపోవడం మంచిదని ఇండియాలో ఒక భావన ఉన్నది.
నేను అమెరికా వచ్చినప్పటి నుంచి ఆథ్యాత్మికంగా ఊరటకై చాలా మంది నన్ను సమీపించారు. అలాంటి వారిని యోగ, బుద్దిజం, పునర్జన్మను గురించి మాట్లాడదలిస్తే సంస్కృతం, పాళీ నేర్చుకు రమ్మన్నాను. జెన్ బుద్ధిజం గురించి మాట్లాడదలిస్తే చైనా భాష నేర్చుకోమన్నాను. కాని వారికది నచ్చదు. చాలా మంది యోగులు, స్వాములు అమెరికాకు వచ్చి వెళ్ళారు. అలాగే డాక్టర్లు, ఇంజనీర్లు కూడా నా ప్రయోజనం ఏమంటే సాంస్కృతిక విమర్శకు పరిమితం కావాలని మాత్రమే.
ఇండియాలో అధికార అవినీతి, అపరిశుభ్రత, రోడ్ల దుస్థితి గురించి మాట్లాడితే కోపం వచ్చినా సహిస్తారు. అపన్నీ నిజమేనని ఒప్పుకుంటారు. విదేశాల నుండి వచ్చినవారు అమెరికాలో యంత్రాలను ఆహారాన్ని విమర్శిస్తే, అలాగే సహిస్తారు. కాని ఇది సాంస్కృతి విమర్శకాదు. గాంధీని మతంపై కలగావులగపు భావాలు వెల్లడించినందుకు విమర్శిస్తే, బుద్ధుడు దేవుడిని నమ్మాడని గాంధీజీ అన్నందుకు విమర్శిస్తే అది సాంస్కృతిక విమర్శ అవుతుంది. హైందవ పునర్వికాసం కోరేవారు దీన్ని ఒప్పుకోరు. అలాగే ఆమెరికా అధ్యక్షుడు ఇండియాలో చర్చికి పోవడాన్ని విమర్శిస్తే, అది సహించరు. ఇది కూడా సాంస్కృతిక విమర్శే, బుద్దుడు దేవుడని నమ్మాడని గాంధీ ఎన్నడూ ఎక్కడా అనలేదని రుజువు చేస్తే ఫరవాలేదు. కాని అలా చేయరు. మదన్ మోహన్ మాలవ్య, ఒకసారి విద్యార్థులకు సలహా ఇస్తూ పాలు తాగండి, వ్యాయాం చేయండి, దైవాన్ని స్మరించండి అన్నారు. దీనికి నేను విమర్శిస్తే నాకు హిందూతత్వం అర్థం కాలేదని, ప్రాచీన ఋషులు అనుభవం ఆధారంగా మాలవ్య చెప్పాడని అన్నారు. కాని మాటల సందర్భంగా మాలవ్య అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. ఋషిగా వుండటానికి, యూనివర్శిటీలో ఋషిగా అభివృద్ధి చేయడానికి ఒకే పద్ధతిని వినియోగించడం సరియైన ధోరణికాదు.
రష్యా పండితుడు ప్రొఫెసర్ స్టెచర్ బాట్ స్కీ లెనిన్ గ్రాడ్ ను నాజీలు పట్టుకున్నప్పుడు ఆకలితో మరణించాడు. మహాయాన బౌద్ధంలోనూ, బౌద్ధ తర్కంలోనూ అతడు గొప్ప ప్రామాణికుడు. ఈ విషయాన్ని ఇండియాలో ఒక ఉన్నత సంస్కృత పండితుడితో చెప్పినప్పుడు ఆ రష్యన్ అసలు పండితుడే కాదనట్లు మాట్లాడారు. అతడు చేసిన కృషిని ప్రస్తావించి వాటి సంగతేమిటని అడిగితే పారిస్ తాగి రాత్రిళ్ళు విలాస క్లబ్బులకు వెళ్ళేవాడని చెప్పాడు. సాంస్కృతిక విమర్శలో పాండిత్యానికి, జీవిత విధానానికి మానసిక తాత్విక రీతుల దృష్ట్యా ఎలాంటి సంబంధం లేదని గ్రహించాలి.
నాస్తికత్వానికి, విధేయత లోపానికి సంబంధాలు లేవు. రస్సెల్ వంటి నాస్తికులు పరిపాలిస్తే నియంతృత్వం గాని, నీతి మయం లేకపోవడం గాని ఉండదు.
సాంస్కృతిక విమర్శ అనేది సమగ్ర దృక్పథం గలది. గాంధీ బోధనలను నేను పొగిడితే, నా మాటలలో తాత్వికత, విషయజ్ఞానం లేకపోయినా, ఇండియాలో నన్నెవరూ వ్యతిరేకించరు. పైగా నాకు చాలామంది స్నేహితులవుతారు. కాని నేను విమర్శకు పూనుకోవాలంటే పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలి. అసత్యమని తెలిసి కూడా ప్రీతి కరంగా మాట్లాడుతుంటే, నాగరికులు కూడా ఆనందిస్తారు.
సిద్ధాంత రీత్యా నైతిక దృష్ట్యా తేడాలున్నప్పుడు వాటిని చూపాలి తప్ప, నవ్వుతూ ఊరుకోకూడదు. ప్రపంచంలో ప్రజల మధ్య సాధారణ విషయాలెన్నో ఉన్నాయి గనుక అందరూ కలిసి రావాలని అంటుంటారు. ఒకే సిద్ధాంతాన్ని నమ్మినవారు పోరాడుకోరాదనటం అర్థం లేని మాట. బర్మాలోని తేరవాద బౌద్ధులు సయాం తేరవాద బౌద్ధులపై దాడి చేసి లోగడవారి రాజధాని ఆయూధియాను తగులుబెట్టారు. బౌద్ధ విగ్రహాలను తగుల బెట్టి అందులో బంగారం ఉందేమోనని వెదికారు. యూరోప్ లో క్రైస్తవ దేశాలు సామరస్యంగా ఉండటం లేదు. అన్ని మతాలలో సారాంశం ఒకటేనని చెప్పటం భ్రమ. అన్ని మంచి సిద్ధాంతాలలో ఐక్యత ఉన్నదనటం కూడా మిథ్యే. పరస్పరం కాల్చుకోకుండా బ్రతకటం మంచిదని నమ్మటం ఒకటే సరైన తీరు.
సంస్కృతులకు పరస్పర అధ్యయనం చేయాలి. మనకున్న పాండిత్యాన్ని విచక్షణను ఉపయోగించి ఈ విమర్శను సాగించాలి. ఒకరి సంస్కృతిని మరొక సంస్కృతికి అనుకూలంగా మార్చే దృష్టితో సాంస్కృతిక విమర్శ జరుగరాదు. దోషాలు తెలుసుకుని, కొత్త పంథాలు చూడటానికే విమర్శ జరగాలి. భారతీయులు పాశ్చాత్యులను, అలాగే పాశ్చాత్యులను భారతీయులను పరస్పరం మార్చుకోవడానికి విమర్శించుకోరాదు. వారి దృష్టిలో ముఖ్యమైన విషయాలను ఏ దృష్టితో చూస్తున్నారనేదే గ్రహించాలి. సాంస్కృతిక విమర్శ వివిధ సంస్కృతులకు చాలా ఉపయోగకారి. ఇండియాలో ఎమ్.యన్. రాయ్ ఇలాంటి సాంస్కృతిక విమర్శ చేశారు. నేను జర్మన్, యూరోప్ ఆలోచనలను, భావాలను విమర్శించాను. ఇందులో బయట వారు, లోని వారు అనే తేడా ఉండదు. విమర్శ దృష్టా ఆయా వ్యక్తులు అంతరంగికులైతారు. ఇలాంటి విమర్శలలో తన, మన అనే భేదభావాలు అర్థరహితమౌతాయి.

No comments: