Saturday, November 10, 2007

సన్యాసి సత్యం పలికితే Agehananda(Ochre Robe) 11

భారత స్త్రీల లైంగిక సమస్య
ఒక గ్రామంలో ఒక స్ర్తీ నాతో సందేహాలు తీర్చుకోడానికి ఇలా అడిగింది. నాకు ఏడుగురు సంతానం. గత పదేళ్ళుగా నా భర్తతో కాపురం చేస్తున్నాను. మన కవులు చెప్పే ఆనందం గాని, మనపాటలలో వినిపించే విషయాలుగాని నాకు ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు. ఆమె చెప్పదల్చుకున్న దేమనగా భార్యగా పిల్లలను కన్నానే తప్ప లైంగికంగా నాకు తృప్తిలేదు అని మాత్రమే.
నేను తొమ్మిది మాసాలు కాలి నడకన దేశమంతా తిరిగాను. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, వింధ్య ప్రాంతాలు, హైదరాబాదు. కూర్గ్ లలో గ్రామీణ స్త్రీలు ఇంచుమించు తమ లైంగిక అసంతృప్తిని మాటలలో నాకు వెల్లడించారు. ఢిల్లీ, కలకత్తా, పాట్నా, ట్రివేండ్రంలో ఉన్న వంశాలకు చెందిన స్ర్తీలు ఇలానే చెప్పటం నాకు తెలుసు. భారతీయ పురుషులు గొప్ప ప్రేమికులనే గొప్పలు చెప్పుకోవడం తప్ప భార్యల నుండి ఇలాంటి ఫిర్యాదులున్నాయని వారికి తెలియదు. ఈ విషయాలను వారికి చెప్పేవారు లేరు. గ్రామాలలో నేను పురుషులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఈ విషయాలను సూచన ప్రాయంగా చెప్పాను. వారి ముఖాలలో రాగద్వేషాలున్నవి. తరచు స్త్రీలతో సంపర్కం ఉన్నప్పుడు స్త్రీలకు అసంతృప్తి ఉంటుందని పురుషులు భావించరు. ఒకవేళ తెలిసినా పట్టించుకోరు. లైంగిక సంబంధం ఒకవిధి అని, అది పురుషుడికి అనందాన్నిస్తే చాలని అనుకుంటారు.
గ్రామాలలో ఆహారం, దైనందిన చర్యలు, లైంగిక విషయాలు, మత పరంగా జరిగిపోతుంటాయి. మొత్తం మీద గ్రామాలలో హిందువులు దయామయులు. ప్రేమపాత్రులు. నేను వారితో విభేదించినా, కఠినంగా మాట్లాడేవారు కాదు. ఆగ్రహం కూడా సన్యాసులపట్ల వ్యక్తమయ్యేదికాదు. అతిథి గౌరవం గ్రామాలలో గొప్పగా ఉండేది.





మానసికంగా దేవి దర్శనం

నేను 1500 మైళ్లు పర్యటించాను. నా ధ్యాన దృషిని మరల్చలేదు. నాకు ఈ విషయంలో ఏకాగ్రత ఉన్నది. నాగపూర్ కు దక్షిణంగా 50 మైళ్ళ దూరంలో దారితప్పి గ్రామస్తులను మార్గం అడిగాను. తరువాత 11 మైళ్ళు నడిచి ఒకచోట రోడ్డుకు 50 గజాల దూరంలో ఒక గుడిని చూశాను. సాధువుకు త్రోవలో ఎక్కడ దేవాలయం కనిపించినా తన భక్తి ప్రవత్తులు వెల్లడించాలి. నేను చూసింది 14వ శతాబ్దం నాటి గుడి. అందులో విఠల్ విగ్రహం ఉన్నది. ద్వారప్రవేశంలో సాలగ్రామం ఉన్నది. లోనికి ప్రవేశిస్తే దేవి విగ్రహం కనిపించిది. పూలమాలాలంకృతమైన ఆ దేవి విగ్రహం చుట్టూ పూజాద్రవ్యాలతో, సువాసనలతో ఆకర్షణీయంగా ఉన్నది. చుట్టూ ఎవరూ కనిపించలేదు. విగ్రహం ముందు ప్రణామం చేసి కొంచెం సేపు పూజించి బయట ఒక స్థంభంపై ఉన్న పూలమాలను దేవి మెడలో వేసి నిశ్శబ్దంగా కాసేపు కూర్చున్నాను. అప్పటికి మధ్యాహ్నం కావస్తున్నది. కుంకుమ తీసుకుని నొసటికి అద్దుకుని మరోసారి ప్రణామం చేసి బయలుదేరాను. రెండు మైల్ళు వెళ్ళేసరికి గుడిసెలలో బీడీలు తాగుతూ కొందరు రైతులు కనిపించారు. అలసిపోయిన నన్ను విశ్రాంతి తీసుకోమని మజ్జిగ ఇచ్చారు. దేవిగుడి గురించి అడిగి పూజ ఎవరు చేస్తారని ప్రశ్నించాను. వారంతా ఏమీ ఎరుగనట్టు ముఖం పెట్టారు. అందులో 50 సంవత్సరాల వయస్సుగల ఒక వ్యక్తి మహారాజ్ ఇక్కడకి 50 మైళ్ల చుట్టుపట్ల దేవి గుడి ఏదీ లేదు. మేము విఠలుడిని పూజిస్తాం. కొందరు శివపూజ చేస్తారు. నేను కలవరపడి చూసిన విషయాన్ని చెప్పాను. అతడు మళ్ళీ ఇక్కడకు 6 మైళ్ల దూరంలో మార్తాండుడి గుడి వున్నది. కాని మాతాతల కాలం నుండి అక్కడ పూజా పునస్కారాలు లేవు. అక్కడ ఏవో శక్తులున్నాయని ఎవరూ వెళ్ళరు అన్నాడు. నేను ఆశ్చర్యంతోనూ, ఆగ్రహంతోనూ మరోసారి అక్కడకు వెళ్లానుకున్నాడు. నాతోపాటు రమ్మంటే ఎవరూ రాలేదు గాని, దయ్యాలంటే, భూతాలంటే భయంలేని కుర్రవాడనిచ్చి పంపించారు.ఈ సంఘటనకు కారణాలు ఉత్తరోత్రా ఆలోచించాను. కొన్ని వారాలుగా నేను దేవిని గురించి ఆలోచిస్తూ సౌందర్యలహరి గానం చేస్తూ ఉన్నాను. నా మనస్సంతా దానిపై లగ్నమైనందున అది ఏదోక విధంగా వ్యక్తం కావాలి. ఈ విధంగా జరిగిందని మానసిక వివరణ చెప్పుకోవచ్చు. దీనినే హిందువులు దర్శనం అంటారు.

No comments: