Friday, November 2, 2007

AGEHANANDA bHARATI-6


కలలుగన్న భారత దర్శనం
అనుకున్న క్షణం రానే వచ్చింది. ఎన్నాళ్ళ నుండో కలలు కన్న భారత భూభాగంపై అడుగు పెట్టాను. అది గాంధిజీని హత్య చేసిన రోజు. నెల రోజుల పాటు ఓడ ప్రయాణం చేసి 1949 జనవరి 30వ తేదీన బొంబాయికి చేరాను. కొన్ని వారాలకు ముందే నన్ను తన అతిథిగా వుండమని ఒక సంపన్న ముస్లిం ఆహ్వానించాడు. ఆయన ఇంట్లో అతిథ్యం స్వీకరిస్తే వియన్నాలో వున్నట్లు అనిపించింది. అంతే కాకుండా చాలా కాలం క్రితం మానేసిన మాంసాహారం మళ్ళీ అక్కడ స్వీకరించాను. కాని ఒక తేడా వున్నది. చక్కని ఉర్దూ నాకూ వచ్చు అనిపించాను.
మరునాడు హెద్దార్ రోడ్డులో తిరిగి ఖాకీదుస్తులు, గాంధీ టోపి కొన్నాను. హారస్ బి రోడ్డు, కొలబా మొదలైన ప్రాంతాలలో తిరుగుతూ నా మాతృదేశంలో వున్నట్లే భావించాను. నన్ను ఇండియాలో ఎలా చూస్తారో అనే భయం వుండేది. ఒకసారి న్యూ ఢిల్లీలో ఒక ప్రభుత్వ కార్యాలయంలో నన్ను గురించి అనుకుంటున్న మాటలు విన్నాను. ఇతడు మనలాగానే మాట్లాడతాడు. అదే చాల ప్రమాదం మొత్తం మీద ఇండియాలో నాకు తటస్థపడిన వారిలో నూటికి తొంబై మంది స్నేహంగానే వున్నారు.
కాకుంటే నన్ను చూసిన వెంటనే ఆశ్చర్యపోయేవారు. కొన్ని పారిశ్రామిక నగరాలలో మాత్రం నాపై వ్యంగ్య వ్యాఖ్యానాలు వినవచ్చేవి. వారి భాష మాట్లాడటం, కాషాయ వస్త్రాలు ధరించడం ముఖ్యంగా యూనివర్శిటీలలో నాపట్ల అనుమానం కలగడానికి కారణమయ్యేది. నేను ఎప్పుడైనా సినిమాకు వెళితే నన్ను చూడగానే గౌరవంగా క్యూని పాటించకుండా టికెట్ కొనుక్కోనిచ్చేవారు. మూడు పర్యాయాలు యిలా జరిగింది. దీనికి కారణం నేను తెల్లవాడిని కావడమేనని అనుకున్నాను. కాని నోరువిప్పితే క్యూ నుంచి బయటకు నెట్టేసేవారు. అదే ఇంగ్లీషు ఫారెన్ యాసలో ఒకసారి పెద్దగా అరిస్తే అది ఎంతో బాగా పనిచేసింది. ఇండియాలో చాలా సినిమాలు పౌరాణిక ఇతి వృత్తాలతో కూడినవే. అందువల్ల సన్యాసి సినిమాకు పోకూడదనడం కేవలం రాగద్వేషాల వల్లనే.
బొంబాయిలో మూడు రోజులు గడిపాను. తరువాత శాంతా క్రజ్ కు సమీపంలో వున్న ఖార్కు స్థానిక ట్రైన్లో వెళ్ళాను. అక్కడే రామకృష్ణ ఆశ్రమం వుంది.

శ్రీరామకృష్ణ ఆశ్రమంలో
నేను యూరప్ లో వుండగానే రామకృష్ణ మిషన్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను. ఫలితంగా ఖార్ లోని రామకృష్ణ మిషన్ కు వెళ్ళగానే నాకోసం ఎదురు చూస్తున్న ఒక బెంగాలీ నాకు స్వాగతం పలికాడు. నన్ను లోపలికి తీసుకు వెళ్ళి కూర్చోబెట్టి మఠాధిపతి దర్శనం కోసం వేచి వుండాలన్నాడు. ఈ లోగా నాతో పిచ్చాపాటీ మాట్లాడాడు. ఎంతో కాలం నుంచి నేను వారిమధ్య వుంటున్న వాడిలాగా నాతో మాట్లాడాడు. నాకు చాలా ఆనందం అనిపించింది. తరువాత మఠాధిపతిని కలిశాం. అతను బెంగాలీ... పొట్టిగా లావుగా, అతి సామాన్యంగా కనిపించాడు. 55 సంవత్సరాలు వుండవచ్చు. నావైపు చూసి మూడు రోజుల క్రితమే రావలసింది. ఎందుకు రాలేదన్నాడు. నేను దిగజారిపోయాను. ఓడ అనుకున్న దానికంటే ఎక్కువ కాలం తీసుకుందని చెప్పాను. అతను తల ఊపాడు. మొదట ఇంగ్లీషులోను, తరువాత నెమ్మదిగా అంత బాగా రాని హిందీలోనూ మాట్లాడాడు. అక్కడ మూడు రోజులు మాత్రమే వుండాలని తరువాత కలకత్తా దగ్గర ఆశ్రమానికి పంపుతామని చెప్పాడు. సాయంకాలం జరిగే ఆరతి కార్యక్రమంలో తప్పక పాల్గొనాలని మిగిలిన సమయంలో నా యిష్టం వచ్చినట్లు వుండవచ్చునని చెప్పి నన్ను పంపించేశాడు. ఇద్దరు ఆశ్రమవాసులు నాకు గది చూపెట్టారు. ఒక తెల్ల ధోవతి, తెల్ల చొక్కా యిచ్చారు. అవి బ్రహ్మచారి దుస్తులు. ఆ గదిలో మంచం మీద కూర్చొని చుట్టూ దోమతెర వేసుకుని కాసేపు ధ్యానం చేసుకున్నాను. సాయంకాలం గంటలు వినిపించగా హడావుడిగా పంచె కట్టుకుని దేవాలయం దగ్గరకి వెళ్ళాను. సుమారు 30 మంది జనం వున్నారు. ఒక సన్యాసి హార్మోనియం వాయిస్తుండగా మరొక బ్రహ్మచారి తబలా వాయిస్తున్నాడు. కొందరు సంపన్నులు ఊళ్ళో నుంచి వచ్చారు. అందులో గుజరాతీ వారు కూడా వున్నారు. సీనియర్ స్వామీజీ ప్రార్ధన చేయడం, ప్రసాదాలు పంచడం పూర్తి చేసిన తరువాత చివరకు రామకృష్ణ పరమహంస విగ్రహానికి ఆరతి ఇవ్వడంతో సాయంకాలం కార్యక్రమం ముగిసింది. ప్రార్థనలో అందరూ పాల్గొన్నారు.
మరునాడు సాయంత్రం నన్నూ, మరో ఇద్దరు బ్రహ్మచారులనూ ఒకజైన వ్యాపారుడి భార్య టీకి ఆహ్వానించింది. ఆమె పేరు సుశీల, చక్కని టీ, పకోడీలు, జిలేబీలు - ఇంకా అనేక తీపి పదార్థాలు వడ్డించింది. ఆశ్రమంలో ఒకే రకమైన ఆహారం తింటుంటాం. ఈ మార్పు బాగానే వుంది. మేము టీ త్రాగుతూ మాట్లాడుకుంటుండగా యిద్దరు అందమైన అమ్మాయిలు అక్కడికి వచ్చారు. ఒక అమ్మాయికి 18 సంవత్సరాలు వుంటాయి. మరొక అమ్మాయి ఇంకా పిన్న వయస్కురాలు. వారు చేతులు కట్టుకుని నమ్రతతో నిలుచున్నారు. నా మాటలకు హాయిగా నవ్వారు. అందులో పెద్దమ్మాయి పేరు మాలిని. ఆమె త్వరలో ఒక జైన యువకుడిని పెళ్ళి చేసుకోబోతున్నట్లు సుశీల నాతో చెప్పింది. ఈ విధంగా మాటలు సాగుతుండగా యిద్దరు బ్రహ్మచారులలో ఒకరు ఓమ్ కేష్ జేవురు మొహంతో గుండు నిమురుకుంటూ ఆశ్రమానికి పరిగెత్తాడు. అతను అలా ఎందుకు వెళ్ళాడని సుశీల మమ్మల్ని అడిగింది. నేనూ ఏమీ చెప్పలేక పోయాను. ఆశ్రమానికి వెళ్ళి అలా హఠాత్తుగా యెందుకు వెళ్ళిపోయాడో కనుక్కుందామని గదిలో ప్రవేశించాను. రుద్రాక్షమాల క్రిందపడి వున్నది. అతడు కూర్చుని ఏడుస్తున్నాడు. నేను స్నేహపూర్వకంగా ఓదారుస్తూ కారణం అడిగాను. అతడు వెక్కివెక్కి ఏడుస్తూ ప్రేమలు, పెళ్ళిళ్ళు గొడవ నేను వినదల్చుకోలేదు. అదంతా ఎప్పుడో వదిలేశాను. ఆవిడ మళ్ళీ ఆ మాటలు మొదలు పెట్టింది. నాకు జుగుప్స కలిగింది అన్నాడు. నేను ఏమీ అనలేదు. కాని అతడు ఆశ్రమ జీవితానికి పనికిరాడని భావించాను. రెండేళ్ల తరువాత అతడు ఆశ్రమం వదిలేసి ఒక బెంగాలీ నర్సును పెళ్ళి చేసుకున్నాడు. చాలా మంది బ్రహ్మచారులకు, సన్యాసులకు అతనికి పట్టిన అదృష్టం పట్టదు. మానసిక సంయమనం లేనివారు చాలామంది ఆశ్రమాసులు చివరకు అక్కనే తేలతారు. కాషాయ వస్త్రాలను వదిలేస్తే, వారు అపఖ్యాతి పాలవుతారు.
వారాంతానికి మఠాధిపతి నన్ను కలకత్తా వద్దనున్న రామకృష్ణ మిషన్ కు పంపారు. బొంబాయి నుంచి మూడో తరగతి పెట్టెలో ప్రయాణం సాగించాను. ఆ అనుభవంతో తరువాత సాధ్యమైనంత వరకు మొదటి లేదా రెండవ తరగతిలో ప్రయాణం చేశాను.

No comments: