Tuesday, November 27, 2007

వైజ్ఞానిక (శాస్త్రీయ) పద్ధతి అంటే...



రచయిత (Left)
ప్రొఫెసర్ (కీ.శే) ఎ.బి.షా.
తెలుగు సేత
ఎన్. ఇన్నయ్య పిహెచ్.డి.(Right)

ఎ.బి.షా గురించి

అమృతలాల్ భిక్కు భాయి షా (ఎ.బి. షా - 1920-1982) భారతదేశంలో శాస్త్రీయ పద్ధతి ప్రచారం చేయడానికి 1964లో పూనుకున్నారు. ఎం.ఎన్. రాయ్ శాస్త్రీయ పరిశీలనల ప్రభావంతో సమస్యల్ని క్షుణ్ణంగా పరిశీలించిన షా. సంక్షిప్త వివరణతో సైంటిఫిక్ మెథడ్ (1964) రాశారు. దేశంలో సెక్యూలర్ ఉద్యమ నిర్మాతగా షా నిర్విరామ కృషి చేశారు. రాజకీయ, ఆర్థిక, విద్య, మత సమస్యలకు శాస్త్రీయ పద్ధతి అన్వయించిన ఖ్యాతి షాకు దక్కుతుంది. రానున్న తరాలకు యీ పద్ధతి ఎంతో ఉపయోగకారి.

ముందు మాట
ఇది ఎందుకు అవసరం?
మాది శాస్త్రీయం అనడం నేడు పరిపాటి అయింది. పవిత్ర గ్రంథాలను శాస్త్రీయం అంటూ భక్తులు వాదిస్తున్నారు. అంటే భగవద్గీత, వేదాలు, బైబిల్, కొరాన్ శాస్త్రీయం అనగలుగుతున్నారన్నమాట. ఏ దైనా సరే శాస్త్రీయం అయితే, చాలా గౌరవ ప్రదం అని భావిస్తున్నారు. ఈ జాబితాలో యిటీవల వాస్తును, జ్యోతిష్యాన్ని పోటీ పడి చేర్చుతున్నారు. ఇక చికిత్సల సంగతి చెప్పనక్కర లేదు. ఆక్యు పంక్చర్ మొదలు హోమియో పతి వరకూ శాస్త్రీయ పరిధిలో చేర్చుతున్నారు. ఈ సందర్భంగా ఏది శాస్త్రీయం, ఏది అశాస్త్రీయం తెలుసుకోవడం మంచిది. కొందరు సైంటిస్టులు, సాంకేతిక విజ్ఞానులు మూఢనమ్మకాలలో శాస్త్రీయత చూపుతున్నారు.
భారత రాజ్యాంగం సైంటిఫిక్ ధోరణి విధిగా ఫెంపొందించాలన్నది. ప్రాథమిక విద్యాస్థాయి నుండే శాస్త్రీయతను ఆకర్షణీయంగా, ఉదాహరణలతో పిల్లలకు చెప్పాలి. శాస్త్రీయత అంటే సైంటిఫిక్ అనే అర్ధంలో వాడాలి. ఇందులో ప్రధానమైన అంశం తనను తాను దిద్దుకుంటూ, సరి చేసుకుంటూ ముందుకు సాగడం. శాస్త్రీయతలో తిరుగులేని, మార్చడానికి వీల్లేని ప్రమాణాలుండవు. కొత్త విషయాలు కనుగొంటుంటే పాత వి చరిత్రలోకి పోతాయి. ఇది నిరంతర కృషి. ఒకసారి చెప్పింది ఎవరూ మార్చడానికి వీల్లేదనే ధోరణికి శాస్త్రీయతలో చోటు లేదు. శాస్త్రీయత గురించి సులువుగా, విడమరచి చెప్పడం కష్టం. బాగా అవగాహన వుంటేనే అది సాధ్యం.
కీ.శే. ఎ.బి.షా. శాస్త్రీయత గురించి టూకీగా, లోతుపాతులతో చెప్పారు. విద్యార్థులందరూ దీనిని చదవాలనే దృష్టితో హెచ్. నరసింహయ్య, బెంగుళూరు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ వుండగా బి.ఎ. స్థాయి విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా పెట్టారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శాస్త్రీయత గురించి తెలుసుకుంటే, పిల్లలకు చాలా ఉపయోగం. సమాజాభివృద్ధికి ఎంతో దోహదకారిగా, శాస్త్రీయ పద్ధతి వుంటుంది. ఈ రచనను, ఆ లక్ష్యంతో, అందిస్తున్నాము.

- ఎన్. ఇన్నయ్య

(To be continued)

1 comment:

Burri said...

మంచి టపా, తెలియజేసిన మీకూ నెనర్లు. ప్రొఫెసర్ షా గారు శాస్త్రీయత గురించి సులువుగా, విడమరచి చెప్పడములో దిట్ట. ఆ సైంటిఫిక్ మెథడ్స్ గురించి ఈనాటికి చాలామందికి తెలియదు.

-మరమరాలు