రెండో ప్రపంచయుద్ధం మొదలుకాకముందే కొన్ని దేశాలు ఓడిపోయాయట. మన దేశంలో స్వాతంత్రానికి పూర్వం, తరువాత చిన్న పెద్ద పార్టీలు లక్ష్యం చేరుకోకుండానే అంతరించాయి.
స్వాతంత్ర్యానికి ముందు పుట్టిన పార్టీలు కొన్ని చాలా పెద్దవారి నాయకత్వాన ఆవిర్భవించాయి.
మొదటి పుట్టిన పార్టీ కాంగ్రెస్, అది ఎన్ని ఒడిదుడుకులకు గురైనా, మరెన్ని వంకలు తిరిగినా, జీవనదివలె ప్రవహిస్తూనే వుంది. పడిలేస్తూనే సాగిపోతున్నది.
సిద్ధాంతాల, లక్ష్యాల విభేదాలతో మొదట కాంగ్రెస్ నుండి చీలిన పార్టీ స్వరాజ్య(1922) దీనిని స్థాపించిన వ్యక్తి సాక్ష్యాత్తు మోతీలాల్ నెహ్రూ. మనరాష్ట్రం నుండి టంగుటూరి ప్రకాశం అందులో చేరారు. బెంగాల్ నుండి చిత్తరంజన్ దాస్ వున్నారు.
కాంగ్రెస్ లో గాంధేయుల విద్రోహానికి గురైన నేతాజి సుభాస్ చంద్రబోసు 1939లో ఫార్వర్ బ్లాక్ పార్టీ పెట్టారు. దానిని యిప్పుడు పశ్చిమబెంగాల్ లో దుర్భిణి వేసి చూడాల్సిందే.
కాంగ్రెస్ లో అభ్యుదయం కావాలని సోషలిస్ట్ పార్టీ పుట్టింది. అందులో ఉన్నత నాయకులు జయప్రకాష్ నారాయణ మొదలు అశోక్ మెహతా, రామమనోహర్ లోహియా వరకూ వున్నారు. మధ్యలో కమ్యూనిస్టులు ముసుగు వీరులుగా చేరి యధాశక్తి తమ పాత్ర నిర్వహించారు.
ఎం.ఎన్. రాయ్ ఆధ్వర్యాన రాడికల్ డెమొక్రటిక్ పార్టీ 8వ సంవత్సరాలు వెలిగి ఆరిపోయింది. (1941-48) రామరాజ్య పరిషత్తు కూడా అలాగే వచ్చి పోయింది. పంజాబ్ కేసరి లాలాలజపతిరాయ్ కాంగ్రెస్ ఇండిపెండెన్స్ పార్టీ 1922లో పెట్టారు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మత వాదశక్తులు స్థాపించుకున్న జనసంఘ (1952) కొన్నేళ్ళకు అంతమై, కొత్త వేషం ధరించింది. అదే భారతీయ జనతాపార్టీ.
తొలి ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ నుండి చీలి చిగురించిన పార్టీ కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ. 1951లో కృపలానీ, రఫీ అహ్మద్ కిద్వాయ్, అజిత్ ప్రసాద్ జైన్, ఆచార్య రంగా, టంగుటూరి ప్రకాశం వంటి వారితో యిది అవతరించింది.
పుట్టుకతోనే చీలిన యీ అఖిలభారత పార్టీ నుండి ఆచార్యరంగా కృషి కార్ లోక్ పార్టీని పెట్టారు. (ఇది చివరకు రాష్ట్రంలో చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలలో సీట్లు గెలిచి, కీలకపాత్ర వహించి కన్నుమూసింది). టంగుటూరి ప్రకాశం కొన్నాళ్ళుండి మారిపోయారు. మిగిలిన వారంతా ప్రజాసోషలిస్టు పార్టీగా తలెత్తారు.
స్వాతంత్రానంతరం జవహర్ లాల్ నెహ్రూ విధానాలను వ్యతిరేకిస్తూ తలెత్తిన అతి ప్రధానపార్టీ స్వతంత్రపార్టీ (1959) చక్రవర్తుల రాజగోపాలాచారి (రాజాజీ) జయప్రకాష్ నారాయణ, ఎం.ఆర్. మసానీ, ఆచార్యరంగా, బెజవాడ రామచంద్రారెడ్డి, పీలూమోడీ, వంటి ఉద్ధండులతో పుట్టిన పార్టీ వయస్సు పదేళ్ళు మాత్రమే. తొలుత మర్రి చెన్నారెడ్డి లచ్చన్న వున్నారు.
భారత ఉద్యమకారుడుగా బి.ఆర్. అంబేద్కర్ నిర్మించిన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ఆలిండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీలను దళితులు నిలబెట్టుకోలేకపోయారు. బౌద్ధ సమాజం పెట్టిన అంబేద్కర్ ఒక ఏడాదికే చనిపోయారు.
లోక్ దళ్ పార్టీ, జనత పార్టీ కేంద్రంలో కీలకపాత్ర వహించినా అస్థిరంగానే నడిచాయి. చరణ్ సింగ్, జగజీవన్ రాం, మొరార్జీ దేశాయ్, రాజ్ నారాయణ, వి.పి. సింగ్, జార్జి ఫెర్నాండజ్ వంటి వారున్న పార్టీలు అవి!
ఈ లోగా కాంగ్రెస్ ఎన్నో అవతారాలు ఎత్తింది. కాంగ్రెస్ ఓ, కాంగ్రెస్ ఆర్, కాంగ్రెస్ ఐ యిలా పులి వేషాలు కనిపించాయి. అన్నీ పోయి, కాంగ్రెస్ కొనసాగు తున్నది.
వివిధ రాష్ట్రాలలో పుట్టిగిట్టిన పార్టీల జాబితా చాలా పెద్దది. కనుక ప్రస్తుతం మన రాష్ట్రానికి పరిమితం అవుదాం.
జస్టిస్ పార్టీ :
ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు, మద్రాసులో వుండగా, జస్టిస్ పార్టీ పుట్టింది. అది మద్రాసులో అధికారంలోకి వచ్చి పాలించింది. పానగల్లురాజా, బొల్లిని మునుస్వామినాయుడు, కట్టమంచి రామలింగారెడ్డి, కూర్మా రెడ్డి నాయుడు, వేణుగోపాలస్వామి, పిఠాపురం రాజా, కుప్పుస్వామి చౌదరి, చల్లపల్లి రాజా, బొబ్బిలి రాజా, త్రిపురనేని రామస్వామి వంటి వారెందరో యిందులో వున్నారు. 1937 నాటికి ఎన్నికలలో ఓడిపోయి నామరూపాలు లేకుండా నశించింది.
తెలంగాణాలో 1952 తొలిఎన్నికల సందర్భంగా, నిషేధానికి గురైన కమ్యూనిస్టులు పూపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరిట పోటీ చేసి ప్రధాన పక్షంగా నెగ్గారు. సోషలిస్టులు ఆలిండియా పార్టీలో భాగంగా బలం చూపగలిగారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత 1962 ఎన్నికలలో స్వతంత్రపార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థానానికి రాగలిగింది. లచ్చన్న నాయకత్వంలో కొనసాగింది.
1969 నాటికి ప్రత్యేక తెలంగాణా కోసం ప్రజాసమితి ఏర్పడింది. ఎ. మదన్ మెహన్, పురుషోత్తమ రావు వంటి వారు. స్థాపకులుగా ఉద్యమం చేబట్టారు. తరువాత కోర్టు తీర్పు, పదవులు కోల్పోయిన మర్రిచెన్నారెడ్డి వుద్యమంలో చేరి, ఉర్రూతలూగించారు.
1971 ఎన్నికలలో 10 లోక్ సభ స్థానాలు గెలిచి, ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని జయప్రదంగా అంతం చేశారు. రెండుసార్లు గవర్నర్, రెండుసార్లు రాష్ట్రముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి లోక్ సభకు గెలిచిన 10 మంది మూకుమ్మడిగా ప్రజాసమితిని తుదముట్టించారు. ఆ ఉద్యమంలో పిలకపార్టీలు పుట్టినా అవి లెక్కలోకి రాలేదు.
దేశంలో పుట్టిన పెద్దపార్టీ జనతకాగా, ఈ రాష్ట్రంలో అది ప్రతిపక్ష స్థానానికే పరిమితమై, తరువాత అదృశ్యమైంది. అలాగే లోక్ దళ్, భారతీయలోక్ దళ్ రాష్ట్రశాఖలు పోయాయి.
1955లో అధికారంలోకి రాగలదన్న వూపుచూపిన కమ్యూనిస్టు పార్టీ, 15 స్థానాలకు సరిపెట్టుకోవలసివచ్చింది. తరువాత చీలిపోయి, రాష్ట్రంలో క్షీణిస్తూ వుంది ఇతర పార్టీలు మద్దత్తుతో వేళ్ళపై లెక్కించే స్థానాలకు పరిమితం అయ్యారు. నక్సల్ మావోయిస్టు ముఠాలు ఎన్నికల జోలికి రావడం లేదు గనుక, వారిని యీ కోవలోకి తీసుకోలేం. 1922లో పుట్టిన తొలి కమ్యూనిస్టు పార్టీ మాత్రం లేదు.
1982లో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ ఎన్ టి. రామారావు నాయకత్వాన రెండుసార్లు ముఖ్యమంత్రి స్థానాన్ని, ఒకసారి ప్రతిపక్ష హోదాను తెచ్చుకున్నారు. ఎన్.టి. రామారావు చనిపోవడం ఒరిజినల్ పార్టీ పోయింది. మధ్యలో నాదెళ్ళ భాస్కరరావు అధికారం చేజిక్కించుకోడానికి పెట్టిన తెలుగుదేశం పదవితో పాటే నెల రోజులలో పోయింది.
చంద్రబాబు నాయుడుకు పోటీగా లక్ష్మీపార్వతి పెట్టిన ఎన్.టి.ఆర్ తెలుగుదేశం నేడు లేనట్లే.
ఒకే ఒకసారి హరికృష్ణ పెట్టిన అన్న జై తెలుగు దేశం తుడుచుకపోయింది.
ఇప్పుడు తలెత్తిన తెలంగాణా రాష్ట్ర సమితికి పోటీగా కొన్ని పిలకలు, మొలిచినా అవి గాలికి రెపరెపలాడుతూ పోతున్నాయి. తెలుగుతల్లి, తెలంగాణా రాష్ట్రపార్టీ, తెలంగాణా సాధన సమితి యిత్యాదులు ఇలాంటివే.
ఇతర రాష్ట్రాలలో నాడు నేడు వచ్చిపోయిన పార్టీల జాబితా చేంతాడంత అవుతుంది. ఇక పార్టీలు మార్చిన వారి చిట్టా ఆ వర్జా పెద్ద దస్త్రం అవుతుంది. ప్రస్తుతానికి సరి.
పట్టిక
పుట్టి పోయిన రాజకీయ పార్టీలు
క్రమ
సంఖ్య దేశ స్థాయిలో మన రాష్ట్రంలో
1. స్వరాజ్య (1922) జస్టిస్ (1920-1937)
2. కాంగ్రెస్ ఇండిపెండెంట్ (1922) కృషికార్ లోక్ (1951)
3. ఫార్వర్డ్ బ్లాక్ (1939) ప్రజాపార్టీ (1952)
4. రాడికల్ డెమొక్రటిక్ (1942) ప్రజాసమితి (1969)
5. కాంగ్రెస్ సోషలిస్ట్ (1935) జనత (1981)
6. కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ (1951) ఎన్.టి.ఆర్. తెలుగుదేశం (1982)
7. ప్రజాసోషలిస్ట్ పార్టీ (1952) జై తెలుగుదేశం
8. స్వతంత్రపార్టీ (1959) తెలుగుదేశం (నాదెళ్ళ భాస్కరరావు)
9. జనత తల్లి తెలంగాణ
10. లోక్ దళ్ తెలంగాణ రాష్ట్రసాధన సమితి
11. భారతీయలోక్ దళ్ జై తెలంగాణ పార్టీ
12. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ
13. ఆలిండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్
14. కాంగ్రెస్ (ఓ), (ఆర్), (ఎస్)