Saturday, July 26, 2008

సాహితీపరులతో సరసాలు

పాలగుమ్మి పద్మరాజు
(1915-1983)
పాలగుమ్మి పద్మరాజు సుప్రసిద్ధ రాడికల్ హ్యూమనిస్ట్. ఎమ్.ఎన్.రాయ్ అనుచరుడు. మానవ వాద తత్వ ప్రభావంతో, రచనలు చేసిన వ్యక్తి. అయితే అనేకమంది దృష్టిలో ఆయన సినీరచయిత, నవలా కారుడు, కథకుడు.
మదరాసు మైలాపూరులో పద్మరాజు చాలా ఏళ్ళు ఉన్నారు. అప్పుడే నేను, ఆలపాటి రవీంద్రనాథ్ ఆయన్ను తరచు కలిశాం. పద్మరాజు మానవ వాద సమావేశాలకు, గోష్టులకు, అధ్యయన శిబిరాలకు వచ్చి ఉపన్యాసాలు చేసేవారు. ఆయన ప్రసంగాలు ఆక్షర్షణీయంగా, లోతుపాతులతో ఉండేవి. ఎమ్.ఎన్.రాయ్ మానవ వాదాన్ని బాగా అర్థం చేసుకోవటమే కాక. తన రచనల్లో ఇమిడ్చి జనానికి చెప్పిన గొప్ప భావుకుడు.
పాలగుమ్మి పద్మరాజు కాశీ విశ్వవిద్యాలయంలో ఎమ్.ఎస్.సి. కెమిస్ట్రీ చదివి, లెక్చరర్ గా కాకినాడలో, భీమవరంలో పనిచేశారు. కాశీలో ఉండగానే ఆయనపై కమ్యూనిజం ప్రభావం చూపింది. అయితే తిరిగి వచ్చిన తరువాత మానవ వాదం వల్ల, కమ్యూనిజాన్ని పక్కన పెట్టేశారు.
పద్మరాజు 1915 జూన్ 24న తిరుపతి పురంలో (తణుకు తాలూకా, పశ్చిమగోదావరి జిల్లా) లో పుట్టారు. అత్తిలిలో 8వ తరగతి వరకు చదివి కవితలు అల్లడం మొదలు పెట్టారు. అది చివరి వరకూ సాగింది. కొవ్వూరులో హైస్కూలు విద్య ముగించి రాజమండ్రిలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. అడ్వకేట్ అవుదామని అభిలషించారు. కానీ లెక్చరర్ గా మారి చివరకు సినిమా రంగంలో కుదురుకున్నారు.
1949లో పద్మరాజు భీమవరంలో ఉండగా పెద్ద గాలివాన వచ్చి ఆయన ఉంటున్న నివాసం కూలిపోయింది. ఆయన భార్య అప్పుడు విపరీతమైన దెబ్బలతో కొంతకాలం బాధపడింది. బహుశా ఆ అనుభూతి వల్లన కావచ్చు పద్మరాజు గాలివాన శీర్షికన కథ రాశారు. దానికి ప్రపంచ స్థాయి గుర్తింపు, బహుకరణ వచ్చింది. న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ ఇంగ్లీషు దినపత్రిక నిర్వహించిన పోటీలో ఆ కథ ఎంపిక అయ్యింది.

ఎమ్.ఎన్.రాయ్ పార్టీ రహిత ప్రజాస్వామ్యం, వికేంద్రీకరణ, మానవ విలువలు సిద్ధాంతాలను దృష్టిలో పెట్టుకొని, “రెండవ అశోకుని మూణ్ణాళ్ళ పరిపాలన” అనే రచన చేశారు. ఒక జటిలమైన సిద్ధాంతాన్ని ఆక్షర్షణీయ మైన నవలగా చిత్రీకరించగల హ్యూమనిస్టు పద్మరాజు.
మేము ఒకసారి మదరాసులో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అరుగుమీద పడక కుర్చిలో కూర్చుని ఉన్నారు. మమ్ములను చూసి కొంచం సిగ్గు పడ్డారు. ఎందుకా అనుకున్నాం. ఆ రోజు ఇంట్లో ఆయన భార్య ఏదో వ్రతం చేస్తున్నది. స్త్రీల హడావిడి కనిపించింది. అందుకే ఆయన సిగ్గు పడ్డారు. ఇలాంటివి పద్మరాజుకు ఇష్టం లేనివి. కాని రాజీపడి ఊరుకున్నాడు. తను మాత్రం ఆచరణలో రచనల్లో మానవ వాదాన్ని చూపారు. పద్మరాజు చేయి తిరిగిన రచయిత.
నార్ల వెంకటేశ్వరరావు తన నాటకాలను ముందుగా చదివి వినిపించటం. చర్చకు పెట్టడం ఆనవాయితీగా మదరాసు, విజయవాడలలో అలవాటు చేశారు. సీతజోస్యం నాటకం అలా చర్చించినప్పుడు పద్మరాజు ప్రముఖంగా పాల్గొన్నారు. ఆవుల గోపాలకృష్ణమూర్తి, అబ్బూరి రామకృష్ణారావు, ఎమ్.వి. శాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బి.ఎస్.ఆర్. కృష్ణ, డి. ఆంజనేయులు మొదలైన వారెందరో పద్మరాజుకు సన్నిహితులు.
అనేక సినిమాలకు పద్మరాజు కథలు, సంభాషణలు రాశారు. డి.వి. నరసరాజుతో సన్నిహితంగా ఉండేవారు. బి.ఎన్. రెడ్డి ఆయనకు మంచి మిత్రులు.
పద్మరాజు రచనలు : బంగారు పాప (1954), రక్తకన్నీరు (సాంఘిక నాటకం) (1965), వెలుగు నీడలు-సాంఘిక నాటకం (1966), బతికిన కాలేజీ (1967), రామరాజ్యానికి రహదారి (1972), శ్రీ రాజేశ్వరి విలాస్ (1976), కప్పు మన్ను (1978), నల్లరేగడి (1989), రంగుల రాట్నం (కథ), భాగ్యరేఖ (కథ), చచ్చి సాధించాడు (నవల) ఇంకా నాటకాలు, నాటికలు, వ్యాసాలు.
1966లో స్టోరీస్ ఫ్రమ్ ఇండియాలో పద్మరాజు రాసిన పడవ ప్రయాణం అనే కథను చేర్చి తరువాత దానికి బహుమతి కూడా ఇచ్చారు. తన కథను తానే ఇంగ్లీషులోకి అనువదించారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో 1966లో ప్రచురించారు.
1968లో పద్మరాజు యూరప్ లోని హంగరీ, బల్గేరియా, రుమేనియా, యుగస్లేవియాలలో పర్యటించి, భారత ప్రభుత్వ సంస్కృతి ప్రతినిధిగా వ్యవహరించారు. పద్మరాజు కేంద్రరాష్ట్ర అకాడమీ అవార్డులు అందుకున్నారు. కొన్ని రచనలు నచ్చగా తెలుగులోకి అనువదించారు. సావిత్రి, వానకారు కథ, చచ్చిపోయిన మనిషి, జవ్వనులకు జాజాగేబర్ సలహాలు వంటివి పేర్కొన తగినవి.
పద్మరాజు సంపూర్ణ రచనలు ప్రచురించే ప్రయత్నాలు సాగుతున్నాయి. త్వరలోనే అవి వెలుగు చూడవచ్చు. పద్మరాజుతో సన్నిహితంగా ఉండగలగటం ఎంతో మంచి అనుభవం.
డి. ఆంజనేయులు ఇంగ్లీషులో పద్మరాజును గురించి చక్కని అంచనా వేసిన వ్యాసం తన పుస్తకం (Glimpses of Telugu Literary persons)లో చేర్చారు.
పి. పోలయ్య పరిశోధన చేసి పద్మరాజు సాహిత్యంపై సిద్ధాంత గ్రంధం శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతికి సమర్పించారు.

7 comments:

Rajendra Devarapalli said...

ఇన్నయ్య గారు,మీవల్ల మాకు రేఖామాత్రంగా తెలిసిన వారి గురించి చాలా విషయాలు విశదంగా తెలుస్తున్నాయి.కానీ అచ్చుతప్పులు ఇబ్బంది పెడుతున్నాయి.
అప్పటిలాగా ఇవ్వాళ సాహితీవాతావరణం ఎందుకు లేదో ఒక్కటపాలో రాయగలరా??

innaiah said...

sorry for the print mistakes.I will take care of them

krishna rao jallipalli said...

NAMASTE, CHALA MANCHI N TELIYANI VISHAYAALU, VISHESHAALU TELIYA CHESINANDUKU ABIVADAALU.

krishna rao jallipalli said...

కమెండో ఎడిటర్ శ్రీ వినుకొండ నాగరాజు గారు చనిపోయారని పేపర్లో చదివాను. వారికివే నా నివాళులు. అప్పట్లో వీరి పత్రిక మరియు శ్రీ పింగళి దశరధరాం గారి ENCOUNTER పత్రిక అంటే చాలా క్రేజ్. అలాగే శ్రీ నరసింహా రావు గారి 'REPU', శ్రీ విజయ బాపినీడు గారి ' విజయ' , 'రమణి', 'ప్రతిమ' , చందమామ వారి ' విజయ చిత్ర', శ్రీ శర్మ గారి 'కాగడా', శ్రీ రెడ్డి గారి 'అపరాధ పరిశోదన', శ్రీ చక్రపాణి గారి 'యువ', శ్రీ బలరామయ్య గారి 'జ్యోతి', ఇంకా అనేక పత్రికలూ కూడా. ఎందుకనో చాలా కాలం క్రితమే కమెండో ఆగి మరల దర్శన మిచ్చింది అన్నారు కాని బుక్ స్టాల్స్ లో నాకు కనపడ లేదు, దొరకలేదు. అలాగే శ్రీ పింగళి దశరధ రామ్ గారు హత్య కావింపబడడం వలన ఆ పత్రిక కూడా ఆగి పోయింది. REPU ఎందుకు ఆగి పోయిందో తెలియదు. అలాగే చాల చాలా మంచి మంచి పత్రికలూ మూత పడ్డాయి. కారణాలు అనేకం ఉండవచు. T.V, INTERNET వచ్చాక పత్రికా, పుస్తక ప్రపంచం మారి పోయింది. మంచికి అయినా, చెడుకి అయినా మార్పు అనేది సహజం.. అది అన్నింటికీ వర్తిస్తుంది.. ఏది ఏమి మినహయింపు కాదు.. కాబోదు.

Anonymous said...

i want to know the meanings of word"sarasaalu".can u pls say it for me.

Anonymous said...

Innaih garu,
Who is Palagummi Sainath? Is he son of P. Padmaraju Garu ?

P. Sainath: Globalizing Inequality
http://video.google.com/videoplay?docid=9078987899127917834

innaiah said...

పాలగుమ్మి పద్మరాజు కు కుమారులు లేరు.పాలగుమ్మి సూర్యా రావు కుమారుదు సాయినాథ్.హిందు పత్రికలో పనిచేస్తున్నారు.
సరసాలు: చనువుగా తెలిసినవారితో మాట్లాడం