బి. ఎస్. ఆర్. కృష్ణ (బండ్లమూడి శివరామకృష్ణ)
ఎడమవైపు మొదటి వ్యక్తి బి.ఎస్.ఆర్.
1954లో గుంటూరులో బి.ఎస్.ఆర్. కృష్ణతో పరిచయమైంది. అప్పుడు నేను ఎ.సి. కాలేజి విద్యార్థిగా ప్రజావాణి తెలుగు వారపత్రికలో రాస్తుండేవాడిని. వట్టి కొండరంగయ్య సంపాదకులు. ప్రతివారం శైలేంద్ర పేరిట రాజకీయ వ్యాఖ్యానం మొదటి పేజీలో బి.ఎస్.ఆర్. రాసేవారు. అలా కలిసిన మేము యిప్పుటి వరకూ సన్నిహితులుగా వున్నాం.
టాల్ స్టాయ్ కథలు కొన్ని తెనిగించిన బి.ఎస్.ఆర్. సొంత కథలు రాశారు. కర్షక పత్రికలో, మద్రాసు నుండి తాత్కాలికంగా నడిచిన విజయ ప్రభలో బి.ఎస్.ఆర్. పనిచేశారు. గుంటూరులో టుబాకో బోర్టు వారునడిపిన పోగాకు లోకం పత్రికను బి.ఎస్.ఆర్. ఎడిట్ చేశారు.
ఆనాడు ఆంధ్రప్రభ నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వాన మద్రాసు నుండి వచ్చేది. గుంటూరులో సోమయాజులు విలేఖరి. కొన్ని వాస్తవ వార్తలు పంపితే వేసేవారు కాదు. వారికి నచ్చి కొన్ని వార్తలకు అనూహ్య ప్రచారం యిచ్చేవారు. ఒకసారి ప్రజావాణి కార్యాలయంలో బి.ఎస్.ఆర్., నేనూ కూర్చొని ఒక వార్త సృష్టించాం. గుంటూరు జిల్లా కళాకారుల సంఘం ఏర్పరచినట్లు, ప్రారంభోత్సవానికి అక్కినేని నాగేశ్వరరావును ఆహ్వానిస్తున్నట్లు వార్త రాసి పంపాం. పెద్ద అక్షరాలతో బాగా ప్రచురించారు. నవ్వుకున్నాం.
బి.ఎస్.ఆర్. తో బాటు తరచుగా ప్రజావాణిలో దరువూరి వీరయ్య, వాసిరెడ్డి సత్యనారాయణ (చెరుకు లోకం సంపాదకులు), నల్లమోతు సత్యనారాయణ రాస్తుండేవారు. ఆ తరువాత బి.ఎస్.ఆర్., దరువూరి వీరయ్య వియ్యంకులు అయ్యారు. ఎన్నికల సమయంలో ఆచార్య రంగా పత్రిక వాహిని తాత్కాలికంగా దినపత్రికగా నడిపేవారు. 1955 ఎన్నికలలో విజయవాడ నుండి అలా నడిపినప్పుడు బి.ఎస్.ఆర్., కె.వి.సుబ్బయ్య అందులో పనిచేశారు.
1956లో బి.ఎస్.ఆర్. కొత్త ఉద్యోగం రీత్యా మద్రాసు వెళ్ళి, అమెరికన్ కాన్సలేట్ లో చేరారు.
అమెరికన్ రిపోర్టర్ పత్రిక నిర్వహించారు. నిబంధనల రీత్యా యితర పత్రికలకు రాయడానికి వీల్లేదు. 1983లో రిటైర్ అయ్యేవరకు ఆయన రాయలేదు.
మద్రాసు తరచు వెళ్ళి బి.ఎస్.ఆర్. ను కలిసేవాణ్ణి. అమెరికన్ కాన్సలేట్ వున్నాడు గనుక ఆయన సిఫారసు చేస్తే, వీసాలు సులభంగా వస్తాయని భ్రమించేవారు. అలా వచ్చిన వారికి నిష్కర్షగా బి.ఎస్.ఆర్. నిజం చెప్పేవారు. సిఫారసులు నడవవనీ, అలా చేస్తే అయ్యే పని కూడా చెడుతుందని అనేవారు. ఆశపడి వచ్చిన వారికి అది నచ్చేది కాదు.
కాన్సలేట్ లో ఆయనతో బాటు కె.వి. సుబ్బయ్య, వల్లభ జోస్యులు సుబ్బారావు కుమారుడు భాస్కరరావు, మాగంటి కోటేశ్వరరావు, ఎం. మాధవ రావులు సహచరులుగా పనిచేశారు. అక్కడ మంచి లైబ్రరీ వుండేది.
అమెరికన్ కాన్సలేట్ లో పనిచేస్తూ అమెరికా వెళ్ళని ఆఫీసర్ బి.ఎస్.ఆర్. రిటైర్ అయి, పెన్షన్ స్వీకరిస్తున్నారు. అప్పుడు రచనా వ్యాసంగం ప్రారంభించారు. ఆంధ్రజ్యోతిలో కొన్నాళ్ళు రాశారు. వివిధ చిన్న, పెద్ద పత్రికలకు రాశారు.
తెలుగుదేశం ఎన్.టి.రామారావు స్థాపించిన తరువాత, హైదరాబాద్ వచ్చి, వారి కోరికపై శిక్షణ విద్యాలయంలో కొన్నాళ్ళు బి.ఎస్.ఆర్. శిక్షణ యిచ్చారు.
చెన్నపురి ఆంధ్రమహాసభ, మద్రాసు తెలుగు అకాడమి, మద్రాసు జర్నలిస్టు అసోసియేషన్, రచన అనే రచయితల సంఘం, ప్రపంచ తెలుగు సమాఖ్య కార్యక్రమాలలో చురుకుగా పాలొంటున్నారు. ఇందిరాదత్ తో కలసి సమాఖ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందు లో అప్పుడప్పుడు పుస్తక సమీక్ష చేస్తున్నారు. సొంత యిల్లు అమ్మేసి, అద్దె యింట్లోనే హాయిగా వుంటున్నారు.
బి.ఎస్.ఆర్. తన కుమారుడి జ్ఞాపకార్థం రవీంద్రనాథ్ ఠాగోర్ రాసిన స్వేచ్ఛ గేయాన్ని పుస్తకంగా వేసి, పంచారు. ఒకే గేయాన్ని దాదాపు 30 మంది తెలుగులో చేసిన అనువాదం యీ గ్రంథం. సౌమ్యంగా మాట్లాడతారు. అలాగే రాస్తారు. ఆయన సన్నిహితంగా మెలగిన వారిలో పాలగుమ్మి పద్మరాజు, డి. ఆంజనేయులు, కొంగర జగ్గయ్య, మల్లిక్, రమణయ్య, రాజా, చందూర్, మాలతీ చందూర్, బెజవాడ గోపాలరెడ్డి, ఆచార్య రంగా, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బాపు, రమణ యిలా పెద్ద జాబితా వుంది.
జమీన్ రైతు వారపత్రిక వారిచ్చిన రామానాయుడు జర్నలిజం అవార్డ్ బి.ఎస్.ఆర్.కు సరైనది.
ఆయన జన్మదిన సన్మాన సభలో పురాణం సుబ్రహ్మణ్యశర్మ సింగిల్ కాలం వలె నిటారుగా బి.ఎస్.ఆర్, విలువలు నిలుపుతున్నాడన్నారు. బాగుంది.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
బి.ఎస్.ఆర్ ఉద్యోగం చేస్తున్నప్పుడే అమెరికా వెళ్ళిన గుర్తు!
శైలేంద్ర వారి అబ్బాయి పేరు!
విమానం కధ వారు పిల్లలకోసం ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించిన మరొక పుస్తకం.
వారు ఒకసారి, తమిళనాడు స్థానిక ఎమ్ ఎల్ ఏ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటిచేసారు.
బి.ఎస్. ఆర్ ఎప్పుడూ తెల్లని, తెలుగు కట్టులోనే కనిపించేవారు.
బి యెస్ ఆర్ అమెరికా వెళ్లలేదు.
1984 లొ వైజయంతిమాల పై పోటి చేసి మధ్యలొ విరమించుకున్నారు.అయినా 3 వేల వోట్లు వచాయి.
Post a Comment