Saturday, July 12, 2008
మెస్మరిజం అంటే ఇదన్నమాట--Part 1
Mesmer
మెస్మరిజం
మెస్మరిజం అనే మాట బహుళ ప్రచారం పొందింది. మన సినిమాలలో, వైద్యంలో, వూళ్ళల్లో, ఎన్నో నోళ్ళల్లో మెస్మరిజం అనే మాట వింటుంటాం. అయినా మెస్మరిజఁ లోతుపాతులు చాలామంది తెలుచుకోకుండానే యీ మాట ప్రభావానికి లోనుగావడం మన అలవాట్ల బానిసత్వాన్ని సూచిస్తుంది. కనుక నిజానిజాలు విడమరచి చూద్దాం.
ఫ్రాంజ్ ఏంటన్ మెస్మర్ (1733-1815) ఆస్ట్రియా దేశవాసి. కాన్ స్టన్స్ సరస్సు ఒడ్డున చిన్న ఆస్ట్రియా నగరం - 1733 మే 23న ఇజ్నార్ లో పుట్టాడు. వైద్యం అభ్యసించక ముందు దైవశాస్త్రం చదివాడు. 1766 నాటికి వైద్యంలో కూడా డాక్టరేట్ పుచ్చుకున్నాడు. గ్రహాలు మానవుడిపై ఎలా ప్రభావం చూపుతాయనే విషయమై సిద్ధాంతం వ్రాసి డిగ్రీ స్వీకరించాడు. 1768లో మెస్మర్ ఒక భాగ్యశాలి అయిన విధవను వివాహమాడాడు. సాంస్కృతిక జీవనంలో కళలు ఆస్వాదించి, అనుభవిస్తూ జీవితం గడిపాడు. అయినా విలాసాలతో వృధా చేయక, జ్ఞానార్జనకు కృషిచేశాడు.
ఆనాడు యూరప్ లో కొత్తగా బహుళ ప్రచారం పొందుతున్న అయస్కాంతంతో చికిత్సపట్ల మెస్మర్ ఆకర్షితుడయ్యాడు. మరియా తెరీసా కొలువులో జ్యోతిష్యుడుగా మాక్సి మిలియన్ హెల్ అనే జెసూట్ ఫాదరీ అయస్కాంతంతో వైద్యం చేస్తుండేవాడు. ఇది 1774 నాటిమాట. మొదట్లో నీటితో వైద్యం చేస్తుండే ఫాదరీ, క్రమేణా అయస్కాంత రాళ్ళువాడాడు. ఒక సాంకేతిక నిపుణుడి సాయంతో భిన్న ఆకారాలు గల అయస్కాంతరాళ్ళు పెట్టేవాడు. వియన్నా వైద్య సంఘం యీ విషయమై అతడిని పట్టించుకో లేదు. 1774 వేసవిలో వియన్నాకు వచ్చిన విదేశస్తుడు తన భార్యకు అయస్కాంత వైద్య చికిత్స చేయమని కోరాడు. హెల్ నుండి ఇదంతా మెస్మర్ నేర్చాడు. మానసిక చికిత్స కూడా హెల్ ముందుగా మెస్మర్ కు చెప్పాడు. సంసపన్న స్త్రీకి తాను ఎలా చికిత్స చేస్తున్నదీ హెల్ ఎప్పటికప్పుడు మెస్మర్ కు తెలియజేసేవాడు. కొన్నాళ్ళకు ఆ స్త్రీకి నయమైనట్లు మెస్మర్ స్వయంగా తెలుసుకొని అయస్కాంత చికిత్స పట్ల ఆకర్షితుడయ్యాడు.
1774-1776 అయస్కాంత చికిత్సలు చేసిన మెస్మర్, విశ్వవ్యాప్తంగా ద్రవపదార్థం వుంటుందని నమ్మాడు. అదే అయస్కాంత ప్రభావానికి మూలం అనుకున్నాడు. అయస్కాంతం కేవలం కొన్ని అంగుళాల మేరకే ప్రభావం చూపుతుందని మెస్మర్ కు తెలుసు. కనుక అయస్కాంతంలో దాగివున్న శక్తులు వున్నాయని, అవే రోగాన్ని నయం చేస్తున్నాయని విశ్వసించాడు. రోగం వున్నదని భ్రమించి వచ్చే రోగులపై మెస్మర్ చికిత్స బాగా పనిచేసింది. అయస్కాంత రాళ్ళు సర్వాంతర్యామి శక్తిలో భాగం అని మెస్మర్ నమ్మిన తరువాత, నీటిని ఆ రాళ్ళతో అయాస్కాంతీకరణ గావించి రోగులచేత తాగించేవాడు. పింగాణి కప్పులు, పళ్ళాలు, బట్టలు, పరుపులు, అద్ధాలు అయస్కాంతీకరణ చేసేవాడు. విద్యుత్ వలె అయస్కాంత ద్రవం కూడా అట్టిపెట్టి, ఇతర వస్తువులకు అందించవచ్చని మెస్మర్ భావన. పెద్ద తొట్టు తయారు చేసి అందులో రెండు వరసల సీసాలు అమర్చి, వాటి మూతలకు బెజ్జాలు పెట్టి, వాటి నుండి ఇనుపచువ్వలు పైకి వచ్చేటట్లు చేసి, రోగులను ఆ ఇనుపచువ్వలను తాకమనేవాడు. సామూహికంగా రోగులు తొట్టిలో కూర్చొని యీ చికిత్స పొందేవారు. ఒకరి చేతులు మరొకరు పట్టుకొని కూర్చుంటే అయస్కాంతం ఒకరి నుండి మరొకరికి ప్రాకుతుందని మెస్మర్ నమ్మించాడు.
మెస్మర్ పలుకుబడి, కీర్తి ఆనోటా ఆనోటా పడి బాగా వ్యాపించగా రానురాను అయస్కాంత రాళ్ళతో పనిలేదని, తన వ్యక్తిత్వ ప్రభావంతో చికిత్స చేయవచ్చని మెస్మర్ గ్రహించాడు. లోగడ ఎవరికైనా నయమైందంటే అది తన వ్యక్తి ఆకర్షణ ప్రభావం వల్లనేనని కూడా అతను గ్రహించాడు. తానే ఒక అయస్కాంతం అని మెస్మర్ ఊహించాడు. 1776 నుండి అయస్కాంత రాళ్ళకు తిలోదకాలిచ్చాడు. ఆ తరువాత తమ మాటల మూటలతోనే చికిత్సకు ఉపక్రమించి కొనసాగించాడు.
ఆనాటి శాస్త్రజ్ఞులు మెస్మర్ చికిత్సను శాస్త్రీయం కాదని ఖండించారు. అయస్కాంత ప్రభావ పరిమితులు శాస్త్రజ్ఞులకు తెలుసు. కాని నయమైనదని చెప్పే రోగుల సాక్ష్యాలను మెస్మర్ వాడుకొని, తన చికిత్సను అలాగే చనిపోయేవరకూ చేశాడు. కనుకట్టు విద్యగా అది ప్రచారంలోకి వచ్చింది.
అయస్కాంత ప్రభావం శరీరంలోని అన్ని భాగాలలో వ్యాపించి ఉంటుందనీ, నరాలపై దీని ప్రభావం పడుతుందనీ 1775లో మెస్మర్ ఒక వైద్యుడికి రాశాడు. పశువుల అయస్కాంతం కూడా వున్నదని మెస్మర్ నమ్మాడు. మూర్చలు, ఉదాశీనత, మంకు మొదలైన లక్షణాలు నయం చేసే అయస్కాంత పరిశోధనలు చేస్తున్నట్లు మెస్మర్ పేర్కొన్నాడు. సూచన () అనేది వైద్యంలో భాగంగా మారిందన్నమాట. నిజమైన శారీరక రుగ్మతలు వుంటే మెస్మర్ చికిత్సకు స్వీకరించేవాడు కాదు. తనకేవో జబ్బు లక్షణాలున్నాయని భ్రమించేవారినే మెస్మర్ తీసుకునేవాడు. నరాల జబ్బున్న వారినే తాను చికిత్సకు చేర్చుకుంటానని మెస్మర్ స్పష్టం చేశాడు. అక్కడే అతడి కిటుకు పనిచేసింది. ఇదే మెస్మరిజంలో ఆకర్షణ. శరీరాన్ని బాధిస్తూ పైకి కనిపించే రోగలక్షణాలు అయస్కాంత చికిత్సకు పనికిరావన్నాడు. మాటలు, ఉపమానాలు సూచనలుగా పనిచేస్తాయని, అవి నరాల జబ్బున్న మానసిక రోగులకే పరిమితం అని మెస్మర్ వాదన.!
హస్తలాఘవం, కనికట్టు, మాటల ఉపమానాలు అనేవి మెస్మర్ ప్రయోగించిన ఆయుధాలన్నమాట. రోగంతో బాధ వున్నట్లు చెప్పే శారీరక భాగాల్ని మెస్మర్ తాకి నిమిరేవాడు. ఆ విధం నయమైతే అది వైద్యమే ననేవాడు. అదే చేతి చలవ (అయస్కాంత ప్రభావం) అనేవాడు. తన అబద్దాలను తానే నమ్మడం, ప్రచారం చేయడం, రోగుల్ని నమ్మించడం మెస్మర్ పనిగా కొనసాగించాడు. ఖనిజ సంబంధమైన అయస్కాంతం రోగిని నయం చేస్తుందనకుండా, అయస్కాంత ప్రభావం వేరే వుందని మెస్మర్ అనేవాడు. మనుషుల్లో మార్మికంగా అయస్కాంతశక్తి గర్భితమై వుందన్నాడు.
ఆనాటి శాస్త్రజ్ఞులు మెస్మర్ ను తీవ్రంగా ఖండించారు. పశు అయస్కాంతం అనే పేరిట మెస్మర్ ప్రచారంలో పెట్టిన భావనకు ఆధారాలేవీ లేవన్నారు. అయస్కాంత రాళ్ళకు బదులు, అయస్కాంత ప్రభావం గల చేతిస్పర్శ మెస్మర్ ఆకర్షణగా ప్రచారంలోకి వచ్చింది.
నమ్మకంతో నయం అవుతుందనే వారికి మాటలు ఆకర్షణ ప్రధాన లక్షణం. మెస్మర్ ఆనాడు ప్రయోగించింది అదే, మత పరంగా చేస్తున్నవారి ఆయుధమూ అదే. హోమియోవారు నేడుచేస్తున్నదీ యిదే. కొంతవరకు ఆయా నమ్మకం చికిత్స కారుల విచిత్ర వేషధారణ కూడా పనిచేస్తుంది. వారు వాడే కొన్ని వింత పరికరాలు కూడా దోహదం చేస్తాయి. నమ్మకం, భయం రోగిలో వుండగా అవే వైద్యుడికి అక్కరకు వస్తాయి.
Continued in part 2
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment