Sunday, July 13, 2008

Mesmer cheated-final part-కనుకట్టు విద్యగా





ప్రాలిన్ పేరడిస్ అనే బాలిక 1763 డిసెంబరు 9 ఉదయం హఠాత్తుగా తన చూపు పోయిందని తెలుసుకున్నది. ఆ బాలిక వయస్సు 4 ఏళ్ళు. కంటి నరం పక్షవాతంతో వున్నందున యిది నయం కాదని వైద్యులు చెప్పారు. తల్లిదండ్రుల సంప్రదాయంగా ఆ బాలికకు పియానో వాయించడం అలవాటైంది. రాణి కొలువులో ఆమె తల్లిదండ్రులు పనిచేసేవారు. ఆ బాలిక ప్రతిభ రాణిని ఆకర్షించింది. 10 ఏళ్ళపాటు వియన్నాలో అత్యుత్తమ కంటి వైద్యుడు చికిత్స చేసినా చూపు రాలేదు. ఈలోగా పియానోపై తన ప్రతిభను చూపుతున్న పేరడిస్ (మరియా తెరీసా అని కూడా పిలిచేవారు) లండన్, ప్యారిస్ మొదలైన చోట్ల కచేరీలు చేసి, గుడ్డి అమ్మాయి అద్భుతంగా పియానో వాయించడం పట్ల అందర్నీ ఆకట్టుకున్నది. కంటి వైద్యుడు ఏంటన్ వాన్ స్టార్క్ 14 ఏళ్ళ ప్రాయంగల ఆ అమ్మాయి కంటి నరం చెడలేదని నిర్ణయించాడు. కాని అతడి చికిత్స పనిచేయలేదు. గుడ్డితనాన్ని నటనగా ఆమె వాడుకుంటుందన్నమాట. అది గిట్టుబాటు గుడ్డితనం.
అలాంటి దశలో మెస్మర్ తటస్తపడ్డాడు. శారీరకంగా కంటిజబ్బు వుంటే నయం కాదని, లేకుంటే చికిత్స చేయవచ్చనీ చెప్పాడు. 1778లో మెస్మర్ ఆమెకు చికిత్స ప్రారంభించాడు. 1777 నుండీ ఆమె మెస్మర్ చికిత్సాలయంలో వుండగా, కొద్దివారాలలోనే చూపు కొంతమేరకు వచ్చింది. తల్లిదండ్రులు సంతోషించారు. మొదటిసారి చూపు వచ్చినప్పుడు ఎదుట వున్న మెస్మర్ ను చూచి, ఎంత భయంకర దృశ్యం అని ఆమె వ్యాఖ్యానించింది. చూపు వచ్చిన తరువాత ఆమె మానసికంగా కృంగిపోయింది. బంధుమిత్రులను చూచినప్పుడు మూర్ఛపోతుండేది. ఆమె హిస్టీరియా జబ్బుతో వుందని బయటపడింది. కావాలని గుడ్డితనం నటించిన ఫలితమిది.
వియన్నాలో జోసెఫ్ బార్త్ ఆధ్వర్యాన వైద్యబృందం పరిశీలించి మెస్మర్ ను తీవ్రంగా విమర్శించింది. ముందున్న వస్తువుల్ని మరియా తెరీసా పేరడీస్ యింకా గుర్తించలేకపోతున్నదని వారు వెల్లడించారు. అంతటితో మెస్మర్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఆ అమ్మాయికి చూపు వచ్చి వుంటే (మెస్మర్ చెబుతున్నట్లు) రాణి యిచ్చేడబ్బు ఆమె తల్లిదండ్రులకు యిక యివ్వనవసరం లేదన్నారు వైద్యులు. పియానో వాయించే కచేరీలలో ఆమె పట్ల ఆకర్షణ సగం పోవడం ఖాయమన్నారు. దీంతో ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెను తమకు అప్పగించమని మెస్మర్ ను కోరారు. మెస్మర్ కుంగిపోయాడు తన ప్రతిష్ఠ దెబ్బతిన్నందుకు.!
మెస్మర్-రోగిగా వున్న మరియాతెరరీసా ప్రేమికులుగా వున్నట్లు సమాజంలో ప్రాకిపోయింది. వియన్నాలో యీ విషయం దుమారం వలె అల్లుకపోయింది. ఈ ఫార్సుకు అంతం పలుకమని రాణి మెస్మర్ ను ఆదేశించింది. 1777 మే 2వ మెస్మర్ ఆ ప్రేమికురాలిని తల్లిదండ్రులకు అప్పగించాడు. ఆమె వయస్సు 18 ఏళ్ళు.
తల్లిదండ్రుల వద్దకు చేరిన మరియా తెరిసాకు మళ్ళీ చూపులేదు. గుడ్డితనాన్ని ఆమె ఆనందించింది. అలాగే పియానో కచేరీలు చేసి కీర్తి ఆర్జించింది. మొజార్ట్ కూడా ఆమె కోసం ప్రత్యేకంగా సంగీతం సమకూర్చాడు. 1874 పారిస్ లో అంధురాలుగా ఆమెను జనం పొగుడుతుంటే, అపఖ్యాతి పాలైన మెస్మర్ అక్కడే వున్నాడు.!
1778లో వియన్నా నుండి పారిస్ వెళ్ళిపోయిన మెస్మర్ ఎకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడి వద్దకు చేరి తన మెస్మరిజాన్ని శాస్త్రీయంగా పరిశీలించమన్నాడు. అధ్యక్షుడు ఛార్లిస్ లి రాయ్ యీ విషయం పరిశీలించడానికి మెస్మర్ ను రాసి యివ్వమన్నాడు. మెస్మర్ 27 ప్రతిపాదనలు రాశాడు. చికిత్స సంపూర్ణతకు తన విధానం పరాకాష్ఠ అని మెస్మర్ గొప్పలు చెప్పుకున్నాడు. తన వైద్యవిధానం ప్రచారం చేయడానికి ప్రభుత్వం నియమించిన మతసంస్థ కావాలన్నాడు. ప్రభుత్వం, మతంతో నిమిత్తం లేకుండా సైన్సు పరిశోధన జరుగుతున్న పునర్వికాస కాలంలో మెస్మర్ అలా కోరాడు.
1778లో మెస్మర్, విశ్వసమాజం అనే రహస్య సంస్థ పారిస్ లో స్థాపించి తన వైద్య ప్రచారానికి పూనుకున్నాడు. దీని శాఖలు ఫ్రాన్స్ లో ఏర్పడ్డాయి. మెస్మర్ కు ఆదాయం పెరిగింది. తాను కనుగొన్న పశు అయస్కాంతం తనకు తప్ప ఎవరికీ తెలియదని, దీనిని ఖండించే అధికారం ఎవరికీ లేదని ప్రచారం చేసుకున్నాడు. చార్లస్ ది ఎప్లాన్స్, నికొలస్ బెర్ గస్ అనే యిరువురు శిష్యులు మెస్మర్ కు బాగా ప్రచారం చేసి పెట్టారు.
1784 మార్చి 12న లూయీ 16 ఒక విచారణ కమిషన్ మెస్మర్ గురించి నియమించారు. ఇది సైన్స్ అకాడమీ కోరికపై జరిగింది. మెస్మర్ శిష్యుడు ఛార్లస్ ఆస్పత్రిలో విచారణ సాగించారు. రసాయన శాస్త్రజ్ఞుడు ఏంటోని లవోసియర్, జీన్ సిల్వన్ బెయిలీ (ఖగోళశాస్త్రజ్ఞుడు) జోసెఫ్ ఇగ్నాస్ గిలోటన్ (వైద్యుడు-గిలోటన్ ఉరి ఇతడి పేర వచ్చింది) బెంజమిన్ ఫ్రాంక్లిస్ (అప్పట్లో అమెరికా రాయబారిగా ఫ్రాన్స్ లో వున్న సైంటిస్టు) కమిషన్ లో వున్నారు.
మెస్మర్ చికిత్సలో అయస్కాంత ప్రభావం ఏదీ లేదని కమిషన్ కనుగొన్నది. ఇదంతా తప్పుడు శాస్త్రంగా తేల్చారు. మెస్మర్ వైద్యంలో చికిత్స పొంది నయం అయిందన్నవారిలో చాలామంది శారీరక రోగులు కాదని కమిషన్ కనుగొన్నది. నిజంగా జబ్బున్న ఇద్దరు వ్యక్తులపై మెస్మర్ అయస్కాంత చికిత్స ప్రభావం ఏమీ లేదని గమనించారు. ఒకామె ఉబ్బసం రోగి. సెంట్ ఆర్మన్ అనే విధవ, మరొక యువతి అన్స్. ఆరేళ్ళ క్షయరోగి బాలిక కూడా ఎలాంటి నివారణ పొందలేదు.
మెస్మర్ శాస్త్రీయ పంథా తప్పుడుది అని కమిషన్ క్షుణ్ణంగా పేర్కొన్నది. మెస్మర్ చెప్పే ద్రవం లేదని కూడా చెప్పింది. 1784 ఆగస్టు 11న కమిషన్ తుది నివేదికలో మెస్మర్ ను ఖండించింది. మెస్మర్ పేర్కొన్న విశ్వద్రవ్య పదార్థ చర్య ఏదీ కనిపించలేదనీ, కొందరిలో వూహల కారణంగా శరీరంలో మూర్ఛలు వస్తున్నాయనీ చెప్పారు. ఊహలు రాకుండా అయస్కాంతం చేయగలిగిందేమీ లేదన్నారు. అయస్కాంతం శూన్యం. ఊహే అతిముఖ్యం అన్నారు. అంటే మెస్మర్ చికిత్స మానసిక సంబంధమే తప్ప, శరీరానికి వస్తే అతడేమీ చేయజాలడన్నమాట. పశు అయస్కాంతం అనేది సందేహాస్పదం అని బెంజిమిన్ ఫ్రాంక్లిన్ పేర్కొన్నారు. ఇలాంటి వాటి ఆధారంతో చికిత్స చేయబూనడం భ్రమే అన్నాడు. ఈ విధంగా కమిషన్ నివేదిక మెస్మర్ కు వ్యతిరేకంగా వచ్చింది. 17685లో ఆయన కుడిభుజం వంటివారు కూడా మెస్మర్ కు ఎదురు తిరిగారు. అయస్కాంత చికిత్స గురించి ఆయన అనుచరుడు బెర్గాసే ఉపన్యాసం యివ్వడాన్ని మెస్మర్ ఖండించాడు. రహస్యం బట్టబయలు చేసినట్లు భావించాడు. త్వరలోనే మెస్మర్ పారిస్ కు స్వస్తి పలకవలసి వచ్చింది.
1799లో మెస్మర్ (అది 1957లో ఇంగ్లీషులో జెరోం ఈడెన్ అనువదించారు) మానసిక రుగ్మతకు భౌతిక ఆధారం (అయస్కాంతం) కనుగొన్నవాడిగా తనకు గుర్తింపు రావాలని ఆకాంక్షించాడు. ప్రకృతి శాస్త్రంలో కొత్త సూత్రాలు కనుగొన్నట్లు మెస్మర్ భావించినా, అది రుజువు కాలేదు. మనుషులకు, జంతువులకు అయస్కాంత ద్రవ్యం వుందని మెస్మర్ పేర్కొన్నాడు.! ఈ విశ్వద్రవ్యం మెస్మర్ దృష్టిలో సర్వరోగనివారిణి. మెస్మర్ సృష్టించుకున్న కల్పనాలోకం నిజమని నమ్మాడు. భక్తితో రోగాలు కుదురుతాయనే వారికీ మెస్మర్ కూ తేడా లేదు. అయితే శరీరానికి వచ్చిన రోగాలు మెస్మర్ చికిత్స వలన నయం కాలేదు. రోగాలన్నీ నయం చేయవచ్చుగాని రోగుల్ని కాదని మెస్మర్ చెప్పాడు.! రోగలక్షణాలు శరీరానికి లేనప్పుడు అవి మానసిక చికిత్సలో ప్రధాన భాగాలుగా చెప్పారు. ఇలా మానసిక రోగాలు కుదుర్చుతామనే మెస్మర్ వంటివారే నేటి చికిత్సకు ఆధారమయ్యారు. నయం కావడం, కాకపోవడం ఆయా వైద్యుల మాటల ప్రతిభ, నాటకీయత, రోగుల మనోలక్షణాల బట్టి వుంటుందన్న మాట. ఇదీ మెస్మర్ కథ.

No comments: